- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ భారతితో భూ సమస్యలకు చెక్.. 11 వేల పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్లాన్
రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలు అత్యధికంగానే ఉన్నాయి. క్రమ క్రమంగా పరిష్కారించేందుకు కృషి చేస్తున్నాం. ధరణి పెండింగ్ దరఖాస్తులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికతో వెళ్తున్నాం.

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలు అత్యధికంగానే ఉన్నాయి. క్రమ క్రమంగా పరిష్కారించేందుకు కృషి చేస్తున్నాం. ధరణి పెండింగ్ దరఖాస్తులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికతో వెళ్తున్నాం. భూ భారతిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, సమస్యలు పరిష్కారానికి మార్గం చూపుతాం. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కొందుర్గు మండలంలోని దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కారిస్తున్నాం. విద్యా, వైద్య సేవలు ప్రజలకు సక్రమంగా అందేటట్లు పనిచేస్తున్నాము. ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు ఇచ్చేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ‘దిశ’ ప్రతినిధికి ప్రత్యేకంగా వివరించారు.
భూ భారతి, ధరణికి వ్యత్యాసం ఏమిటి...?
ధరణిలో అనేక అప్షన్లు ఉండటంతో దరఖాస్తు చేసే విధానంలో ఇబ్బంది పడ్డారు. కానీ భూ భారతిలో ఆప్షన్ల పరిమితంగా ఉండటంతో దరఖాస్తులు చేసుకోవడం సులభంగా ఉంటుంది. గతంలో ప్రతి ఆప్షన్ ఫైనల్ చేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వడంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం పని విభజన చేయడంతో దాదాపు తహశీల్ధార్, ఆర్డీవో స్ధాయిలోనే పరిష్కారమైతున్నాయి. టీఎం–33, పీవోబీ దరఖాస్తుల మాత్రమే కలెక్టర్ లాగిన్‌లో ఉన్నాయి. గతంలో మాదిరిగా కలెక్టర్‌ను ప్రతి ఒక్కరూ సంప్రదించే అవసరం లేకుండానే స్ధానికంగా ఉండే రెవెన్యూ కార్యాలయాల్లో పని జరిగిపోతుంది.
పెండింగ్ దరఖాస్తులతో రైతులు ఇబ్బందులు...?
రంగారెడ్డి జిల్లాలో 11వేల దరఖాస్తులు పెండింగ్లోనున్నాయి. అత్యధికంగా అదనపు కలెక్టర్ లాగిన్‌లోనే ఉన్నాయి. కలెక్టర్ లాగిన్‌లో కూడా సుమారు 500 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. క్రమ క్రమంగా తగ్గించేందుకు ప్రణాళిక రూపొదించుకున్నాం. రెండు నెలల్లో పెండింగ్ దరఖాస్తులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. భూ భారతి చట్టం అమలులోకి రావడంతో సమస్యలకు చెక్ పెట్టే అవకాశం వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో కొందుర్గ్ మండలంలో భూ భారతి ఫైలెట్ ప్రాజెక్ట్‌గా కొనసాగుతుంది. మే 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 573 దరఖాస్తులు వస్తే వెనువెంటనే క్లియర్ చేస్తున్నాం. పెండింగ్ దరఖాస్తులకు అవకాశం లేదు. జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో భూ భారతి అమలు కానుంది. ఈ నేపథ్యంలో ప్రతి మండంలోని గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించి సక్సేషన్, మ్యూటేషన్, పేరు మార్పు వంటి చిన్న పనులను అక్కడిక్కడే పరిష్కారించాలని ప్రభుత్వం సూచించింది. భూ భారతి వచ్చిన తర్వాత సక్సేషన్, మ్యూటేషన్‌కు ఇబ్బందులుండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆటోమెటిక్‌గా మ్యూటేషన్ అయ్యే అవకాశం భూ భారతిలో ఉంది.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
జిల్లాలోని భూములు ఖరీదైనవి. ప్రభుత్వ భూములను కాపాడుకొని ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాలి. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రత్యేక కార్యాచరణతో అడుగులు వేస్తున్నాము. ప్రభుత్వ భూమి చూట్టు పెన్సింగ్ వేయించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, స్ధానిక తహశీల్ధార్ తో ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నాం. రాబోయే రెండు, మూడు నెలల్లో ప్రతి ప్రభుత్వ భూమి చూట్టు పెన్సింగ్ ఏర్పాటు చేయాలనే ధృడ సంకల్పంతో పనిచేస్తున్నాం. భూ సర్వే చేసి మ్యాపింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వేయర్ల నియామకం చేపట్టాం. 437 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి శిక్షణ ఇస్తున్నాం. తదనంతరం నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
అక్కడక్కడ కబ్జాలు అవుతున్నాయి కదా...?
ఎన్నో ఏండ్లుగా కబ్జాలు చేసుకొని సాగు చేస్తున్నారు. కొంత మంది ఎప్పుడో నిర్మాణాలు చేపట్టారు. దీంతో కోర్టు కేసుల సమస్యలు వస్తున్నాయి. కోర్టు సూచనలు పాటించకపోతే కంట్మెంట్ కేసులు కలెక్టర్‌పై పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 8500 కేసులు వివిధ కోర్టులో నడుస్తున్నాయి. ఇందులో 375 కేసులు కోర్డు ఆదేశాల ధిక్కరణ కింద కలెక్టర్‌పై పెట్టిన కేసులున్నాయి.
ఈ కేసులన్ని ఎలా ఎదుర్కొంటారు ?
జిల్లాలోని రెవెన్యూ పరంగా నమోదైన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. త్వరలో ఈ కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ రూపొందించి, ఆన్లైన్లో ఉండేలా చూస్తాం. సిరీయస్‌గా ప్రతి కేసును ఒక్కొక్క అధికారితో ఇన్పుట్ తీసుకొని పోరాటం చేయనున్నాం. కౌంటర్ కేసు వేయడం, ఆధారాలతో కోర్టులో వాదనాలు వినిపించడం చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ కోర్టు కేసులతో సమయమంతా వృథా అవుతుంది. ఈ సమస్య పరిష్కారమైతే మిగిలిన అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రైవేట్ స్కూల్స్‌పై మీ అభిప్రాయం..?
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలకు లోబడి ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేయాలి. నిబంధనలకు విరుద్దంగా ఎక్కడైనా ప్రైవేట్స్కూల్స్నడిపిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆడ్మిషన్లు ప్రారంభిస్తే చట్టపరంగా ముందుకెళ్తాం. ఆధారాలతో ఏవరైనా మాకు ఫిర్యాదు చేస్తే ఆ స్కూల్స్‌పై విచారణ చేపట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్ధులు స్కూల్స్‌కు వస్తున్న సందర్భంలో నిర్మాణాలు జరిగితే ఉపక్షేంచేంది లేదు. జూన్12వ తేదీ తర్వాత ప్రైవేట్, ప్రభుత్వ స్కూల్స్ ఆకస్మిక తనిఖీలు చేపట్టి పరిశీలిస్తాం. వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత పెంచేందుకు నా వంతు కృషి చేస్తాను.
రేషన్ కార్డు దరఖాస్తులకు తగ్గట్టుగా జారీ లేదు..?
జిల్లాలో ఇప్పటి వరకు 28,000 యూనిట్లు కొత్తవారికి రేషన్ కార్డు అవకాశం కల్పించాం. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను ప్రస్తుతం పరిశీలిన చేస్తున్నారు. దశల వారీగా కొత్త వారికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు మీ సేవ, ప్రజాపాలన దరఖాస్తుల్లోని లబ్ధిదారులను గుర్తిస్తున్నాం.
జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతలేవీ..?
జిల్లాలో ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, త్రిబుల్ ఆర్తో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటివి ప్రభుత్వ ప్రాధాన్యతలు. ఫోర్త్ సిటీకి అవసరమైయ్యే భూ సేకరణ పూర్తి చేశాం. ఇందులో కోర్టు కేసులున్న భూములపై దృష్టి పెట్టి పరిష్కరించాలి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి త్రిబుల్ ఆర్ వరకు కలిపే 300 ఫీట్ల రోడ్డుకు అవసరమయ్యే భూసేకరణ చేపట్టాలి. కొంత ఇప్పటికే సేకరించాం. మిగిలిన సేకరణపై రైతులతో మట్లాడి ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో విద్యా, వైద్యం, ఎంఎస్ఎంఈపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన విద్యా, వైద్యం అందించాలని తపన పడుతున్నాను. ఎంఎస్ఎంఈ ద్వారా అత్యధిక లోన్లు ఇప్పించేందుకు బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం.
మీ ముందున్న లక్ష్యం ఏమిటి..?
కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తాం. ఇందులో అర్బన్ ల్యాండ్‌సీలింగ్, ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులో అత్యధికంగా ఉన్నాయి. వీటిని కాపాడుకునేందుకు నిపుణలతో స్టడీ చేస్తున్నాం. ఈ భూములు కాపాడుకొని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. అదే లక్ష్యంతో క్షుణంగా కోర్టు కేసులపైనే సమయం కేటాయిస్తున్నాం.






