- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సెగలు.. దౌల్తాబాద్ లో నేతల దుమారం..!
దౌల్తాబాద్ మండలంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారంటూ అధికారుల తీరు పై స్థానిక నేతలు మండిపడ్డారు.

దిశ, దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండలంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారంటూ అధికారుల తీరు పై స్థానిక నేతలు మండిపడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న జఠిలమైన సమస్యలను పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమైందని ధ్వజమెత్తుతూ మాజీ జడ్పీటీసీ మహిపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను నేరుగా నిలదీస్తూ అక్కడి వాతావరణాన్ని వేడెక్కించారు.
సమస్యల చిట్టా.. అధికారుల తీరుపై తిరుగుబాటు!
గ్రామాల్లో అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటూ నాయకులు ఎమ్మార్వో దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. గ్రామాలకు వెళ్లే దారులన్నీ అధ్వాన్నంగా మారి ప్రయాణికులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చుక్క నీరు దొరకని వైనం:ఎండలు ముదురుతున్నా తాగునీటి కొరత తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కాలిపోతున్న మోటార్లు - విద్యుత్ కోతలు: అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గళమెత్తారు.
స్పందించకుంటే పరిణామాలు తీవ్రం: మహిపాల్ ముదిరాజ్
కొత్తల మహిపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ వినతి పత్రాలు ఇచ్చినప్పుడు తలూపడం తప్ప, పనుల్లో చలనం లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే, మండల వ్యాప్తంగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకటయ్య, శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు అశోక్, సంతోష్, బాలరాజు, ఆశప్ప, వెంకటప్ప, విష్ణు, అనిల్ నాయక్, శోభన్ నాయక్ తదితరులు పాల్గొని అధికారులకు తమ నిరసనను వ్యక్తం చేశారు.






