సిండికేట్ దందా చేస్తున్న సీడ్స్ కంపెనీలు

by Malleboina Mahesh |

విందులు.. టూర్‌ ప్యాకేజీలు వంటి తాయిలాలతో సీడ్స్​, ఫెస్టిసైడ్స్​ కంపెనీలు డీలర్లను మభ్య పెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా గట్టుపల్లిలో సీడ్స్​ కంపెనీలు నిర్వహించిన రేవ్‌ పార్టీ కూడా ఆ తరహాదే.

సిండికేట్ దందా చేస్తున్న సీడ్స్ కంపెనీలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : విందులు.. టూర్‌ ప్యాకేజీలు వంటి తాయిలాలతో సీడ్స్​, ఫెస్టిసైడ్స్​ కంపెనీలు డీలర్లను మభ్య పెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా గట్టుపల్లిలో సీడ్స్​ కంపెనీలు నిర్వహించిన రేవ్‌ పార్టీ కూడా ఆ తరహాదే. ఇంకేం.. విత్తనాలు మొదలుకుని ఎరువులు, పురుగు మందులను ఇష్టమొచ్చిన రేట్లకు డీలర్లు రైతులకు విక్రయిస్తున్నారు. ఒకదానికొకటి లింకు పెట్టి బలవంతంగా అంటగడుతున్నారు. ఈ సిండి‘కేటు’ దందాలో కంపెనీలు, డీలర్లు అంతా ప్రతి ఏటా రూ.కోట్లు లాభం పొందుతున్నారు. నాణ్యతలేని సీడ్స్​, పెస్టిసైడ్స్​ కొన్న రైతులు మాత్రం నిట్టనిలువునా మునుగుతున్నారు. గ్రామానికో విస్తరణధికారితో పాటు మండలానికి, నియోజకవర్గానికి వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నప్పటికీ వారి పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు సైతం నామ్‌కే వాస్తేగా ఉంటున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

చెప్పిందే రేటు..ఇచ్చిందే సరుకు..

కంపెనీలు తమ బ్రాండెడ్‌ విత్తనాలనే అమ్మేలా డీలర్లను మచ్చిక చేసుకుంటున్నారు. జిల్లాలోని గట్టుపల్లిలో జరిగిన రేవ్‌ పార్టీనే ఇందుకు ఉదాహరణ. హైబ్రిడ్‌ పత్తి విత్తనాల ప్రోమోలో భాగంగా మేడ్చల్‌ జిల్లా గాజుల రామారంకు చెందిన వేద సీడ్స్‍, ఇబ్రహీంపట్నంకు చెందిన రాక్‌ స్టార్‌ కంపెనీలు సీడ్స్​‍, ఫెస్టిసైడ్స్‍ డీలర్లతో రేవ్‌ పార్టీని నిర్వహించాయి. ఇదే తరహాలో జిల్లాలోని పలు విత్తన కంపెనీలు డీలర్లతో సీజన్‌ కు ముందు సిండికేట్‌ దందాకు తెరలేపుతున్నాయి. ఇందులో లాభాలు సైతం పెద్ద మొత్తంలో ఉంటుండంతో గ్రామానికో ఫెస్టిసైడ్‌ దుకాణం వెలుస్తోంది. అదే తరహాలో బ్రోకర్లు సైతం ఉంటున్నారు. సిండికేట్‌‌గా మారుతున్న వ్యాపారులు చెప్పిందే రేటు అన్నట్లుగా అధిక ధరలకు విత్తనాలు, ఫెస్టిసైడ్స్​‍ను అమ్ముతున్నారు. నాసిరకం సీడ్స్​, ఎరువులను అంటగట్టడం! లేదంటే.. డిమాండ్‌ ఉన్న సీడ్స్​‍ను కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రెట్టింపు ధరలకు విక్రయిస్తున్న..గత్యంతరం లేక కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

బిల్లులు.. రసీదులు ఇవ్వరు..

కాగా.. రైతులు బ్లాక్‌ లో కొంటున్న విత్తన ప్యాకెట్లకు వ్యాపారులు బిల్లులు, రసీదులు ఇవ్వడం లేదు. ఇష్టముంటే కొనండి..లేదంటే పొండి అంటూ అక్కడక్కడ కొందరు వ్యాపారులు రైతులను దబాయిస్తున్నారు. విత్తనాలు దొరకవేమోనని! ఆందోళనకు గురవుతున్న రైతులు విత్తనాలు కొనక తప్పడం లేదు. కంపెనీలు ఇచ్చే లాభాలు, ఆఫర్లకు ఆశపడి ఆయా కంపెనీల విత్తనాలనే రైతులకు అంటగడుతున్నారు. ఈ విత్తనాలు నాటిన తర్వాత మొలవకపోయినా, పెరగకపోయినా, పూత, కాయలు రాలిపోయి రైతులకు ఎలాంటి నష్టం వచ్చినా ప్రశ్నించే అవకాశం ఉండకుండా వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. చాలా గ్రామాల్లో పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న ఫెస్టిసైడ్స్​ డీలర్లు మరో రకంగా నిలువునా ముంచుతున్నారు. పండించిన పంటలను తమకే ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఎరువులు, విత్తనాలను అరువుగా ఇస్తున్నారు. ధర కూడా వ్యాపారులు చెప్పిన దానికే అమ్మాల్సి రావడం..తూకంలో మోసాలకు పాల్పడుతూ అందినకాడికి దండుకుంటున్నారు.

చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖ..

సీడ్స్​, పెస్టిసైడ్స్​ డీలర్లు సిండికేటు దందాతో రైతులను ఆర్థికంగా కుంగదీస్తున్నప్పటికీ.. వ్యవసాయ శాఖ చోద్యం చూస్తోంది. పెస్టిసైడ్స్​ దుకాణాలు అధికారులకు కల్పతరువుగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎలాంటి అనుమతులూ లేకుండానే జీరో దందా సాగుతుంది. ఇక కొత్తగా షాపుల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే.. ఆమోదం కోసం అన్ని స్థాయిల్లో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వికారాబాద్‌ జిల్లా మోమిన్‌ పేట్‌ మండల వ్యవసాయ అధికారి ఎరువుల దుకాణం లైసెన్స్​ జారీ చేసేందుకు రూ.లక్ష డిమాండ్‌ చేసి ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వ్యవసాయ కోర్సులలో డిగ్రీలు పూర్తి చేసిన వారి పేరు మీద జారీ అయిన లైసెన్స్​‍ల పేరిట అర్హతలేని వ్యాపారులే జిల్లాలో చాలాచోట్ల దుకాణాలను నడుపుతున్నారు. అధికారులు తనిఖీలను సైతం మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కో దుకాణం నుంచి సీజన్‌ ల వారీగా మామూళ్లు అందుతుండడమే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారుల నుంచి స్పందన ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story