- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువుకు ఆనుకుని అక్రమ వెంచర్.. శంషాబాద్ చౌదరిగూడలో రియల్ దందా!
శంషాబాద్ చౌదరిగూడ బొల్లవాని చెరువు బఫర్‌జోన్‌లో జీవో 111 ఉల్లంఘించి అక్రమ వెంచర్.. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత చర్యలన్న ఇరిగేషన్ అధికారులు!

దిశ, శంషాబాద్: చెరువుకు ఆనుకుని వెంచర్ చేస్తున్నారు. ఇరిగేషన్, జీవో 111 నిబంధనలపై నీళ్లు చల్లారు. ఇంత వ్యవహారం నడుస్తున్నా అన్ని శాఖల అధికారులు తమ వంతు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకేముంది వెంచర్ లో రోడ్లు, డ్రైనేజీ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ వ్యవహారం శంషాబాద్ మండలం చౌదరిగూడ గ్రామంలో జరుగుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీ, ఇరిగేషన్, ఇతర విభాగాల అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బలి కానున్న సామాన్యులు..
అధికారుల తీరుతో సమీప భవిష్యత్తులో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బలి అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చౌదరిగూడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వెంచర్ చెరువుకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. సర్వే నెంబర్ 173, 181, 183, 185 లో సుమారు 5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఓ బడా వ్యాపారి దర్జాగా వెంచర్ వేస్తున్నాడని తెలిసింది. ఈ వ్యవహారం అంతా ఆయా శాఖల అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండు నెలలుగా వెంచర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం వెనుకాల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భవిష్యత్తులో చెరువులోకి మురుగు..?
చౌదరిగూడ గ్రామానికి చెందిన బొల్లవాని చెరువు సర్వే నెంబర్ 168 లో విస్తీర్ణం 39.02 ఎకరాల మేర ఉంది. చెరువుకు ఆనుకుని భారీ ఎత్తున వెంచర్ ఏర్పాటు చేస్తుండగా వెంచర్లో ఇళ్ల నిర్మాణం తర్వాత చెరువులోకి మురుగు నీరు భారీ ఎత్తున చేరే ప్రమాదం పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వెంచర్ ఎత్తుగా ఉండగా చెరువు ప్రాంతం పల్లంగా ఉంది. ఈ నేపథ్యంలో డ్రైనేజీ నీరు చెరువులోకి చేరి నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది.
నిద్రమత్తులో ఇరిగేషన్..
చెరువు పక్కనే 111 జీవో పరిధిలో వెంచర్ భారీగా ఏర్పాటు చేస్తున్న ఇరిగేషన్ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం పట్టించుకోకపోవడం వెనకాల ఆంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న వెంచర్ వ్యవహారంలో అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.
మాకు సంబంధం లేదు..
చౌదరిగుడా గ్రామంలోని గొల్లవాని చెరువు పక్కన ఏర్పాటు చేస్తున్న భారీ వెంచర్ విషయంలో తమకు ఏమాత్రం సంబంధం లేదని శంషాబాద్ తహశీల్దార్ అమర లింగం గౌడ్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ పంచాయతీ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
వెంటనే చర్యలు తీసుకుంటాం..
చౌదరిగుడలోని వెంచర్ గతంలో ఏర్పాటు చేసినదేనని పంచాయతీ కార్యదర్శి రమేష్ తెలిపారు. ప్రస్తుతం అందులో రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన చెప్పడం గమనార్హం. వెంచర్ ఏర్పాటు చేస్తున్న విషయంలో వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వెంచర్ ఏర్పాటు వెనుకాల ఎంతటి వారు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదని ఆయన తెలియజేశారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు..
చెరువు సమీపంలో వెంచర్ ఏర్పాటు విషయమై శంషాబాద్ ఇరిగేషన్ ఏఈ రాకేష్ కుమార్‌ను వివరణ కోరగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరిగేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.






