సీల్డ్ కవర్ లో పేర్లు..నేడే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక..!

by velandi.Saikiran |

చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మూడు మున్సిపాలిటీల్లో పార్టీలు చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఆసక్తికర పరిణామాలకు తెరలేపుతున్నాయి.

సీల్డ్ కవర్ లో పేర్లు..నేడే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక..!
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మూడు మున్సిపాలిటీల్లో పార్టీలు చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఆసక్తికర పరిణామాలకు తెరలేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే ఎక్కడికి వెళ్లకుండా ఇతర పార్టీలకు మద్దతు తెలుపకుండా విప్ జారీచేసినట్లు తెలిపింది. పార్టీని కాదని ఎదురు పార్టీకి ఓటు వేస్తే అనర్హత కింద గుర్తించే అవకాశం ఉంది. క్యాంపుల్లోనే అభ్యర్థులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు.

ఆమెకే చైర్మన్ గిరి?

చేవెళ్ల చైర్మన్ పదవికి 16వ వార్డు నుంచి గెలుపొందిన దేవరి సమత వెంకట్ రెడ్డికి లైన్ క్లియర్ గా ఉంది. కానీ వైస్ చైర్మన్ కు దామర గిద్ద 9 (ఎస్సీ రిజర్వ్డు) వార్డు నుంచి గెలుపొందిన తాళ్లపల్లి నర్సింహులు, చేవెళ్ల / కేసారం (బీసీ రిజర్వ్డు) 13వ వార్డు నుంచి గెలుపొందిన కాసుల రాములు గౌడ్ మధ్య పోటీ నెలకొంది. సామాజిక సమీకరణాలు తీసుకొని ఇవ్వడానికి జిల్లా మంత్రి సీల్డ్ కవర్ లో పంపిస్తారని సమాచారం. కాగా, శంకర్ పల్లి చైర్మన్ పదవికి సాత ప్రవీణ్ కుమార్ పేరును ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రకటించగా.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దండు రాజేశ్వర్ పేరును తెరమీదకు తెచ్చారు. మొయినాబాద్ చైర్మన్ గా దుబా సోనియా దర్శన్ పేరు దాదాపుగా ఖరారైంది. కానీ వైస్ చైర్మన్ విజయలక్ష్మి అశోక్ యాదవ్ ఇవ్వకపోతే 8 మందితో క్యాంప్ నుంచి బయటకు వస్తానని స్పష్టం చేయడంతో అధిష్టానం అలోచనలో పడింది. సీల్డ్ కవర్ లో పేర్లు పంపిస్తామని, చేయి ఎత్తాలని సూచించినట్లు సమాచారం.

క్యాంపులో అభ్యర్థులు..

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో ఉన్న లియోనియో రిసార్ట్ లో చేవెళ్ల, శంకర్ పల్లి, మొయినాబాద్ మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్ అభ్యర్థుల క్యాంపు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 11 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 3 బీజేపీ గెలుచుకుంది. మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 10 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, ఐదుగురు స్వతంత్రులు, నలుగురు బీజేపీ నుంచి గెలిచారు. శంకర్ పల్లి మున్సిపాలిటీలో 9 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 2 స్వతంత్రులతో కలిపి మొత్తం 14 మంది క్యాంపు ఉన్నారు.

సీల్డ్ కవర్ లో అభ్యర్థుల పేర్లు..

జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ముగ్గురు చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లు సీల్డ్ కవర్ లో అధిష్టానం పంపిస్తుందని, అందరూ చేయి ఎత్తాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. మున్సిపల్ ఓట్ల లెక్కింపు పూర్తికాగానే కౌంటింగ్ కేంద్రం నుంచే అభ్యర్థులందరినీ క్యాంపులకు తరలించిన విషయం తెలిసిందే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని మున్సిపాలిటీల్లో పోటాపోటీగా ఫలితాలురావడం, మరో చోట మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో డబ్బులా, పదవులా? అనేది తేల్చుకోవాలని పార్టీ ఆదేశించినట్లు తెలుస్తున్నది.

100 మీటర్ల పరిధిలో ప్రవేశం నిషేధం

చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సోమవారం నిర్వహించనున్నారు. ఇప్పటికే చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి మున్సిపాలిటీలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ముందుగా చైర్మన్ ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు చేవెళ్ల పురపాలక సంఘ కార్యాలయంలో గెలుపొందిన మున్సిపల్ వార్డు సభ్యులతో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశం తెలిపారు. ఈ సమావేశ మందిరానికి గెలుపొందిన వార్డు సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. మోడల్ కోడ్ అమలులో ఉంటుందని, 100 మీటర్ల పరిధి లోపల ఎవరికీ ప్రవేశం లేదని వివరించారు.

Next Story