- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో ‘పదవుల’ గొడవలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసం పరితపిస్తున్న బీజేపీలో కీలక నేతలు అసంతృప్తి రాగం ఆలపిస్తుండడం ఆ పార్టీలో కలవరం సృష్టిస్తోంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసం పరితపిస్తున్న బీజేపీలో కీలక నేతలు అసంతృప్తి రాగం ఆలపిస్తుండడం ఆ పార్టీలో కలవరం సృష్టిస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన జిల్లా కమిటీ కూర్పు సందర్భంగానే ఈ అసంతృప్తి రాజుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వికారాబాద్ జిల్లా కమిటీని ప్రకటించగా.. త్వరలోనే రంగారెడ్డి జిల్లా కమిటీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వం ఎదుటే అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ అసంతృప్తికి పదవుల వ్యవహారమే కారణమన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీజేపీలో కొనసాగుతున్న అసంతృప్తి వ్యవహారంపై పార్టీ క్యాడర్ సైతం ఆందోళన చెందుతోంది. రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెద్ద మొత్తంలో పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
పదవుల కోసం విపరీతమైన పోటీ..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అంతకు ముందే స్థానికంగా పట్టు సాధించాలని భావిస్తున్న పార్టీ అధినాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా కార్యవర్గం కూర్పుపై దృష్టి సారించింది. ఆరుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు జనరల్ సెక్రటరీలు, ఆరుగురు సెక్రటరీలు, ఆరుగురు అధికార ప్రతినిధులతో జిల్లా కార్యవర్గంలో 21 కీలక పదవులను భర్తీ చేస్తున్నారు. వీటితో పాటు జిల్లా కార్యవర్గంలో ఇతర నియామకాలతో పాటు నియోజకవర్గానికి ఒకరు చొప్పున సోషల్ మీడియా కన్వీనర్ ను కూడా నియమిస్తున్నారు. అయితే ఈ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా పార్టీ అధ్యక్షుని తర్వాత ప్రధాన కార్యదర్శికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుండగా..ఈ పోస్టుకు విపరీతమైన పోటీ ఏర్పడింది. మిగతా పోటీలకు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటి నుంచే కీలక పదవుల్లో ఉంటే.. వచ్చే అసెంబ్లీ నాటికి దక్కే ప్రాధాన్యం వేరేగా ఉంటుందన్న ఆలోచనతో చాలా మంది నేతలు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు జిల్లాల్లో విబేధాలు బహిర్గతం..
రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడిగా రాజ్ భూపాల్ గౌడ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డిలు కొనసాగుతున్నారు. ఇటీవలే వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని పార్టీ అధిష్టానం ప్రకటించింది. త్వరలోనే రంగారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించాల్సి ఉంది. పదవులకు తీవ్ర పోటీ ఉండడంతో ఒక్కో పదవికి ముగ్గురు, నలుగురు పేర్లను పరిశీలన కోసం పంపించారు. అయితే జిల్లాల కూర్పు సందర్భంలోనే నేతల్లో దాగి ఉన్న అసంతృప్తి పెల్లు బికుతోంది. పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ సమావేశంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల క్రితం వికారాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ కు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిని లోపలికి రానివ్వకుండానే కొండా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే కొండా అసంతృప్తికి కారణం పార్టీ పదవులే అన్న ప్రచారం జరుగుతోంది. తన అనుయాయులకు పార్టీ పదవులు దక్కడం లేదన్న భావనతోనే అసంతృప్తి రాగం విన్పిస్తున్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఎవరికి వారుగా నేరుగా రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించి పదవులను తెచ్చుకుంటున్నారని, ఈ విషయంలో ఎంపీగా తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్న ఆవేదనంలో ఎంపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఆయన జిల్లా అధ్యక్షులపై గుర్రుగా ఉన్నారన్న చర్చ ఊపందుకుంది.
దిద్దుబాటు చర్యలు ఉండేనా ?..
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమించాయి. వీరంతా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. అయితే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు క్యాడర్‌ను ఆందోళనలోకి నెడుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అని పలువురు నేతలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో ఏడు వరకు జడ్పీటీసీ స్థానాలను, వికారాబాద్ జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో జడ్పీటీసీలను గెలుచుకుని జడ్పీలో పాగా వేయాలని నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గ్రామాల్లోనూ బీజేపీ స్థానికంగా బలపడుతున్నదని పార్టీ అగ్ర నాయకత్వం అభిప్రాయపడుతోంది. చేవెళ్ల ఎంపీ కొండా పరిధిలోనే 27 వరకు జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. గట్టి పోటీ ఇస్తే అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతటి అనుకూల పరిస్థితుల్లో నేతల మధ్య కొనసాగుతున్న సమన్వయ లోపం పార్టీ నేతలను కలవర పెడుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం రెండు జిల్లాల్లోనూ దిద్దుబాటు చర్యలకు దిగాలని క్యాడర్ కోరుతోంది.






