ఏయ్.. పోలీసు.. ఏమనుకుంటున్నావ్? రాజకీయ నేతల నోటి దురుసు

by Ajay Maddhiboyina |

పోలీసులపై పొలిటికల్ ప్రజెసర్ తీవ్రమై పరాకాష్టకు చేరుకుంది. నా మాటే వినవా.. నీ అంతు చూస్తా అన్నట్లు వ్యవస్థ తయారైంది. రాజకీయ నేత దురుసు ప్రవర్తనకు ఇటీవల జరిగిన

ఏయ్.. పోలీసు.. ఏమనుకుంటున్నావ్? రాజకీయ నేతల నోటి దురుసు
X

దిశ, సిటీక్రైం: పోలీసులపై పొలిటికల్ ప్రజెసర్ తీవ్రమై పరాకాష్టకు చేరుకుంది. నా మాటే వినవా.. నీ అంతు చూస్తా అన్నట్లు వ్యవస్థ తయారైంది. రాజకీయ నేత దురుసు ప్రవర్తనకు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

నా మాటంటే లెక్కలేదా?

‘ఏం ఇన్‌స్పెక్టర్.. ఏమనుకుంటున్నావ్? నేను చెప్పినా ఫోన్ ఇవ్వవా?’ అంటూ ఓ ప్రజాప్రతినిధి పోలీసు అధికారిపై హుకూం ప్రదర్శించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పేకాట కేసులో ఇన్‌స్పెక్టర్ పలువురిని అరెస్టు చేశారు. వారి ఫోన్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఫోన్ కోసం ఓ రాజకీయ నేత పోలీసు అధికారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ‘నీవు ఎన్నిసార్లు నా దగ్గరకు పోస్టింగ్ కోసం తిరిగావో గుర్తులేదా? చెప్పిన పని చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆ ఇన్‌స్పె్క్టర్ స్వయంగా రాజకీయ నేత వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతున్న ఇన్‌స్పెక్టర్

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో, మరో కేసులో ఓ ఇన్‌స్పెక్టర్ తనకు ఇక్కడ పోస్టింగ్ వద్దంటూ ఆ పీఎస్‌ను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం స్థానిక ప్రజాప్రతినిధి నుంచి తీవ్ర ఒత్తిడికి గురిచేయడమే. ఆయన భాష, వ్యవహార శైలి దురుసుగా ఉండడంతో ఆ ఇన్‌స్పె్క్టర్ స్వచ్ఛందంగా బదిలీ కోరినట్లు తెలిసింది.

నా పేరు విన్నా కేసులా?

సైబరాబాద్ పరిధిలో మరో ప్రజాప్రతినిధి, భూ వివాదాలకు సంబంధించిన కేసులు నమోదు చేయడంపై ఇన్‌స్పెక్టర్‌ను నేరుగా హెచ్చరించినట్లు తెలిసింది. ‘నా పేరు వింటే కేసులు పెడతావా?’ అంటూ ఆయన దురుసుగా వ్యవహరించారు. ఏది ఏమైనా ఆ పోలీసు అధికారి మాత్రం ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తానని తేల్చి చెప్పడంతో అతనిని అక్కడి నుంచి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయించాలని సదరు రాజకీయ ప్రతినిధి అవకాశం కోసం వేచి చూస్తున్నాడు.

జీపు బానెట్‌పై కూర్చొని

మల్కాజిగిరిలో ఓ ప్రతినిధి బహిరంగంగా జీపు బానెట్‌పై కూర్చొని కార్యకర్తల సమక్షంలో పోలీసులను సంబోధించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది పోలీసుల మనోస్థైర్యాన్ని కించపరిచేలా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులను తిడితే హీరోలవ్వరు..

ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేసే పోలీసులను ఎవరైనా హేళన చేయడం బాధాకరమని, చట్ట వ్యతిరేకులకు వత్తాసు పలకడం సరికాదని పోలీసులు అంటున్నారు. కొంతమంది పోలీసులు రాజకీయ నేతలకు సలాం కొడుతూ తమ స్వార్థం కోసం పోటీపడడమే ఈ పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది. పోస్టింగుల కోసం ప్రజాప్రతినిధులకు సేవలు చేసి ఇప్పుడు ఇబ్బందుల్లో పడడం ఎంతవరకు సమంజసమని పోలీసు వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Next Story