- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ ఆస్తి పత్రాలతో కోట్ల విలువైన భూ విక్రయానికి స్కెచ్.. నలుగురు అరెస్ట్
నకిలీ ఆస్తి పత్రాలతో కోట్లు విలువ చేసే భూమిని విక్రయించేందుకు యత్నించిన నలుగురిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు

దిశ, గండిపేట: నకిలీ ఆస్తి పత్రాలతో కోట్లు విలువ చేసే భూమిని విక్రయించేందుకు యత్నించిన నలుగురిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసు వివరాలను ఇన్స్పెక్టర్ హరికృష్ణా రెడ్డి ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. జూన్ 20న కోకాపేట్‌కు చెందిన ఓ వ్యక్తి నార్సింగి గ్రామంలోని బృందావన్ కాలనీలో ఉన్న కోట్ల విలువైన భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం.1179/2026గా కేసు నమోదు చేసి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 338, 336(3), 61(2)తో పాటు 3(5) కింద దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నకిలీ ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల్లో అనుమానాస్పద విక్రయ ఒప్పందం (సేల్ డీడ్ )తో పాటు ఇతర కీలక రికార్డులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో నిందితులు విలువైన భూములపై తమకే యాజమాన్య హక్కులు ఉన్నట్లు తప్పుడు పత్రాలను సృష్టించి, వాటి ఆధారంగా కొనుగోలుదారులను మోసం చేసి విక్రయాలకు ప్రయత్నించినట్లు తేలింది.
నిందితులు వీళ్ళే:
మాకినేని శివ శంకర ప్రసాద్ (74), విజయవాడ, అదేవిధంగా కమ్మెల శ్రీనివాసరావు (58), తెనాలి, గుంటూరు జిల్లా, హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందిననల్లం ఆదినారాయణ (60), అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ని విజయవాడ ప్రాంతానికి చెందిన మజ్జి నరేష్ (43)గా గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. స్వాధీనం చేసుకున్న పత్రాలపై సాంకేతిక, న్యాయపరమైన ధృవీకరణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా, వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి ప్రజలకు కీలక సూచనలు చేశారు. భూములు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు సంబంధిత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని, అసలు యాజమాన్యాన్ని ధృవీకరించిన తర్వాతే లావాదేవీలు జరపాలని సూచించారు. నకిలీ పత్రాల ఆధారంగా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.






