- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత పనులకు.. కొత్త శంకుస్థాపనలు : మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మళ్లీ కొత్త శంకుస్థాపనలంటూ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, ఇబ్రహీంపట్నం : బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మళ్లీ కొత్త శంకుస్థాపనలంటూ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇబ్రాహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమాని.. పాత పనులకు కొత్త శంకుస్థాపనలు.. ఏంటని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్నది అభివృద్ధి కాదని, గత ప్రభుత్వంలో మంజూరైన పనులపై శిలాఫలకాలు వేయడం, పాత వాటిని తొలగించడం, తిరిగి తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం మాత్రమే జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇటీవల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రూ.200కోట్లు మంజూరు చేయించానని అబద్ధాల మాటలు చెబుతున్నాడని.. చేసిన పనులకు ప్రొసీడింగ్ పేపర్లు చూపెట్టాలని ప్రశ్నించారు. అలాగే ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరికరణ పనులకు కేవలం 9 కోట్ల 70 లక్షల రూపాయలకు, 18 కోట్ల రూపాయల విలువతో శిలాఫలకం వేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప.. అభివృద్ధి కాదన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం
గతంలో ఫార్మసిటీ భూములను, రైతులకు పేదలకు తిరిగి ఇస్తామని, ఇవ్వకపోగా, యాచారం మండలం నంది వనపర్తి, నజిక్ సింగారం, కొత్తపల్లి, తాడిపర్తి గ్రామాలలో దేవాలయ ధర్మాదాయ భూములు 1400 ఎకరాలలో రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేసి పేద రైతుల నుంచి, తీసుకోవాలనుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మంచి రెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని ధ్వంసం చేయడమే కాకుండా, శిలాఫలకాలను తొలగించడం, మాయం చేయడం దుర్మార్గపు చర్యని విమర్శించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభోత్సవ శిలాఫలకం మాయమైందని దీనిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలో 100 పడకల ఆసుపత్రిపై అబద్ధాల పునాదని మండిపడ్డారు. మా హయాం కేసీఆర్ ప్రభుత్వంలో G.O.Rt.No.554 | తేదీ: 22-09-2023 ద్వారా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ అప్పుడే రూ. 37.50 కోట్లు కేటాయించగా.. రామోజీ ఫౌండేషన్ ద్వారా రూ. 4 కోట్లు అదనంగా మొత్తం రూ. 41.50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో ఆసుపత్రి నిర్మాణానికి “నేను 100 కోట్లు మంజూరు చేయించాను” అని అబద్ధాలు చెబుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో శిలాఫలకం వేసి.. మళ్లీ దాన్ని తొలగించారు. అలాంటప్పుడు శిలాఫలకం ఎందుకు తొలగించారు? 100 కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని, ప్రజలకు వివరణ ఇవ్వాలని మండిపడ్డారు. అలాగే రోడ్ల విషయంలో ద్వంద్వ వైఖరి హెచ్ఆర్ డీసీఎల్ G.O.Rt.No.510 | తేదీ: 29-07-2022 ద్వారా అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆక్టోపస్ రోడ్డుకు రూ. 60 కోట్లు మా హయాంలోనే మంజూరు చేయించామని, ఆ రోజు ఈ రోడ్డు వద్దని ధర్నాలు చేసి.. నేడు అదే రోడ్డు “నా ఘనత” అంటూ శిలాఫలకాలు వేస్తున్నారని ప్రశ్నించారు.
తుర్కయంజాల్ చెరువుకట్ట – తొర్రూరు రోడ్డుకు రూ. 24 కోట్లు
ఇంజాపూర్ నుంచి మునగనూర్ రోడ్డుకు రూ. 20 కోట్లు ఈ పనులను ఎందుకు మొదలు పెట్టడం లేదని.. అక్కడ ఎన్నికలు లేవా? అని మండిపడ్డారు. అలాగే యాచారం నుంచి మీర్ ఖాన్ పేట రోడ్డు వరకు రూ. 104 కోట్లు ఎందుకు అర్థాంతరంగా ఆపారని విమర్శించారు. అలాగే ఖానాపూర్ (సర్వే నెం.43) "స్పోర్ట్స్ కాంప్లెక్స్" కు రూ. 2.50 కోట్లతో మేము శంకుస్థాపన చేసి 2సంవత్సరాలు అవుతుంది. అది యువతకు ఉపయోగపడేదే కదా అని అన్నారు. అంతే కాకుండా ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డుకు రూ. 3.50 కోట్లు వ్యయంతో మా హయాంలోనే పనులు ప్రారంభించాం. మీరు ఈ పనులను ఆపారు. మళ్ళీ ఎప్పుడూ మొదలుపెడతారని ప్రశ్నించారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా 30 నుంచి 40 శిలాఫలకాలు వేస్తున్నారు. కానీ, కొత్తగా మంజూరు చేయించిన ఒక్క రూపాయి పని కూడా లేదని ఘాటుగా విమర్శించారు. ఇవన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులే అని, శేరిగూడ సాగర్ హైవే శ్రీ ఇందు కళాశాల సమీపంలోని బ్రిడ్జ్ విషయంలో కూడా మోసం చేశారని, ఆ బ్రిడ్జ్ ను కూడా మేమే మంజూరు చేయించి, ఒక వైపు రోడ్డు పనులు పూర్తి చేయించామని తెలిపారు. ఇప్పుడు మీరే ప్రారంభించి.. మీ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రెండో వైపు రోడ్డు ఎప్పుడూ వేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గానికి కొత్తగా మంజూరు చేసిన పనులు ఏవని, మంజూరు అయితే నిధులు ఎక్కడని, ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ప్రజలకు లెక్క చెప్పే బాధ్యత ఎమ్మెల్యేకి లేదా అని ఘాటుగా విమర్శించారు. శిలాఫలకాలు కాదు, అభివృద్ధి పనులు కావాలంటూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే మల్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.






