- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో.. బ్లాస్టింగ్ భయం!
పగలంతా బ్లాస్టింగ్ మోత.. అడ్డగోలుగా డ్రిల్లింగ్.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, గండిపేట: పగలంతా బ్లాస్టింగ్ మోత.. అడ్డగోలుగా డ్రిల్లింగ్.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం అంతా నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ డివిజన్ మర్రిచెట్టు సర్కిల్ సమీపంలో జలమండలి కార్యాలయం పక్కన జరుగుతోంది. సుమారు 15–20 రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ శబ్దాలతో డ్రిల్లింగ్ జరుగుతుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏం జరుగుతుందంటే..
మణికొండ డివిజన్‌లోని మర్రిచెట్టు సర్కిల్ సమీపంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ నిర్మాణ పనులు చేపట్టింది. ఇందుకోసం రెండు నుంచి మూడు కంప్రెసర్లతో నిరంతరం డ్రిల్లింగ్ నిర్వహించడంతో పాటు జెలటిన్ స్టిక్స్‌తో భారీ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా సమీపంలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు కంపిస్తున్నాయని, ఈ పరిస్థితిపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు వచ్చి నామమాత్రంగా విచారణ చేసి వెళ్లిపోతుండగా, యథావిధిగా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ కొనసాగుతుండటంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.
నెంబర్లు లేని టిప్పర్ల ద్వారా..
డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ ద్వారా వెలికితీసిన రాళ్లను సుమారు పది టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే వీటిలో చాలా టిప్పర్లకు నంబర్ ప్లేట్లు లేకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకరంగా రాళ్ల తరలింపు
నిర్మాణ సంస్థ నిర్వాహకులు రాళ్లను ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా టిప్పర్లలో తరలిస్తుండటంతో వాహనదారులు, స్థానికులు ప్రమాద భయంతో ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
స్పందించని డిప్యూటీ కమిషనర్
బడనిర్మాణ సంస్థ వ్యవహారంపై వివరణ కోరేందుకు పలుమార్లు నార్సింగి డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డికి కాల్ చేయగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.






