- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ యాత్రకాదు.. దైవ సంకల్ప యాత్ర
షాద్ నగర్ నుంచి తిరుమలకు తాను చేపట్టిన పాదయాత్ర రాజకీయ యాత్ర కాదని, దైవ సంకల్పయాత్ర అని ప్రముఖ నిర్మాత, నటుడు, రాజకీయవేత్త బండ్ల గణేష్ అన్నారు.

దిశ, షాద్ నగర్ : షాద్ నగర్ నుంచి తిరుమలకు తాను చేపట్టిన పాదయాత్ర రాజకీయ యాత్ర కాదని, దైవ సంకల్పయాత్ర అని ప్రముఖ నిర్మాత, నటుడు, రాజకీయవేత్త బండ్ల గణేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని, జైలు నుంచి క్షేమంగా బయటికి వస్తే నడుచుకుంటూ వచ్చి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్పించుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు. దైవ సంకల్పయాత్ర ప్రారంభ సందర్భంగా సోమవారం షాద్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమల వెంకన్న స్వామి కొండకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ తాను చేపట్టే దైవ సంకల్పయాత్ర రాజకీయ యాత్ర కాదని, చంద్రబాబు నాయుడు పై అభిమానంతో మొక్కు తీసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర అని అన్నారు. తనకు దైవసమానమైన పవన్ కళ్యాణ్, జన్మనిచ్చిన తల్లిదండ్రుల, తాను పుట్టిన గడ్డ షాద్ నగర్ ప్రజల ఆశీర్వాదంతో పాదయాత్రను ప్రారంభిస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి 52 రోజులపాటు అక్రమంగా జైలులో నిర్బంధించారని, ఆ సమయంలో తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని తెలిపారు.
చంద్రబాబు నాయుడి పై పెట్టిన కేసులు అక్రమమని, జైలు నుంచి విడుదల చేయాలంటు కేబీఆర్ పార్క్ వద్ద మొదటగా మాట్లాడింది తానేనని, చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు సురక్షితంగా జైలు నుంచి బయటికి రావాలని, పెట్టిన కేసులు కొట్టివేయాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నానని పేర్కొన్నారు. ఏడు రోజులపాటు కొనసాగే పాదయాత్రతో తిరుమల చేరుకొని తన మొక్కలను తీర్చుకుంటానని బండ్ల గణేష్ తెలిపారు. ఉదయం 9.01 గంటలకు బండ్ల గణేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ పాల్గొని ప్రసంగించారు. మొక్కులు అందరూ మొక్కుతారని, వాటిని నిలబెట్టుకోవడం గొప్ప విషయమని అన్నారు. ప్రజల మనిషి చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు రావాలని మాట్లాడిన మొదటి వ్యక్తి బండ్ల గణేష్ అని అన్నారు. బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆశీర్వాదంతో దిగ్విజయంగా పూర్తి కావాలని కోరారు. అనంతరం షాద్ నగర్ ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ మాట్లాడుతూ మనిషికి చావు పుట్టుకలు సహజమని, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం, అందరి మేలుకోరడం, తమ పుట్టిన ప్రాంతానికి పేరు తీసుకురావడం కొందరికే సాధ్యమని అన్నారు. బండ్ల గణేష్ తీసుకున్న సంకల్పం దిగ్విజయం కావాలని వీర్లపల్లి శంకర్ అన్నారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర గొప్పదని, చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతుగా, అండగా ఉండి సంఘీభావం తెలిపిన గొప్ప వ్యక్తి బండ్ల గణేష్ అని అన్నారు. బండ్ల గణేష్ చేపట్టిన దైవ సంకల్ప యాత్రకు చంద్రబాబు నాయుడు అభిమానులు, బండ్ల గణేష్ అభిమానులు అమెరికా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు.






