- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల ఊబిలో నార్ముల్.. మూతపడటం ఖాయమా?
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) అప్పుల ఊబి నుంచి గట్టెక్కేలా కనిపించడం లేదు.

దిశ, వనస్థలిపురం : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) అప్పుల ఊబి నుంచి గట్టెక్కేలా కనిపించడం లేదు. పాత చైర్మన్ పోయి కొత్త చైర్మన్ వచ్చినా.. డైరెక్టర్ల అవినీతి, ఎండీ నియంతృత్వ పోకడలు, గుత్తాధిపత్యంతో డెయిరీకి ఒరిగిందేమీ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 25లోగా రూ.12 కోట్లు సంస్థకు అందేలా చూస్తానని నార్ముల్ డైరెక్టర్ మందడి ప్రభాకర్‌రెడ్డి ఈ నెల 8న చైర్మన్ కుర్చీ ఎక్కారు. ఆయన పది రోజుల్లో ఇప్పటి వరకు రూ.3 కోట్లు ఇవ్వగా.. అవి రైతుల ఒక నెలన్నర పెండింగ్ బిల్లు చెల్లింపునకే పోగా.. జీతాలు అందలేదని వర్కర్లు ఆందోళనకు దిగుతున్నారు. రైతుల పెండింగ్ బిల్లులు రూ.25 కోట్లకు పైగానే ఉండగా.. వర్కర్ల జీతాలు రెండు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని వారు చెప్తున్నారు. దానికి తోడు అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే వర్కర్ల జీతాల్లో కొంతకాలం 15 నుంచి 30 శాతం వరకు కట్‌చేస్తామని ఎండీ చెప్పడంతో వర్కర్లు గత కొన్ని రోజులుగా ఆందోళనకు దిగుతున్నారు. దీంతో ‘నార్ముల్’ మనుగఢ కష్టమేనని, త్వరలో మూత పడుతుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
ఎండీ గుత్తాధిపత్యంతోనే సమస్యలు..
348 సొసైటీలు, 32 వేల మంది పాడి రైతులు, 40 వేల లీటర్ల పాల సేకరణ, 600 మంది ఉద్యోగులతో 2003లో నార్ముల్‌గా స్వయం ప్రతిపత్తి సంస్థగా.. దినదినాభివృద్ధి చెందింది. గతంలో సంస్థలో ప్రతి సెక్షన్‌కు ఒక హెడ్ ఉంటూ.. ఏ జీవో వచ్చినా.. చిన్న వర్కర్ ట్రాన్స్ఫర్ అయినా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. సంబంధిత ఆర్డర్ అందరికీ అందేది. కానీ ప్రస్తుత ఎండీ కృష్ణ బాధ్యతలు తీసుకున్న తర్వాత క్షేత్ర స్థాయిలో చిల్లింగ్ సెంటర్ల నుంచి స్టోర్, ట్రాన్స్పోర్ట్, బాయిలర్ సెక్షన్ వరకు అన్ని విభాగాలపై ఆయనే అజమాయిషీ చెలాయిస్తూ.. వర్కర్లపై నియంతలా వ్యవహరిస్తుండడంతో సంస్థలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో డెయిరీలో పనిచేసే వారందరికీ ఒకేసారి జీతాలు పడేవి. కానీ ప్రస్తుతం నాలుగు స్లాబ్‌లుగా విభజించి.. ఏ శ్లాబ్ వారికి ఎప్పుడు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ‘ఇప్పటికే మాకు అత్తెసరు జీతాలు పైగా 2 నెలల జీతాలు పెండింగ్ ఉండగా.. ఇక నుంచి కోత విధిస్తామనడం అన్యాయం’ అంటూ పలువురు వర్కర్లు వాపోయారు. ఈ విషయంలో చైర్మన్లకు అవగాహన ఉండడం లేదు. ఏ చైర్మన్ అయినా.. ఇక్కడ నామ్కేవాస్తే.. అంతా ఎండీయే అని వాపోతున్నారు.
రూ.3 కోట్లు రైతుల నెలన్నర బిల్లులకే..
ప్రభాకర్‌రెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే బటర్అండ్ గీ డిస్ట్రిబ్యూటర్ నుంచి రూ.3 కోట్లు ఇప్పించారు. రైతుల నెలన్నర పెండింగ్ బిల్లులకే సరిపోయాయి. అందులోనూ ఎండీతో అంటకాగే పలువురు డైరెక్టర్లు చేతివాటం ప్రదర్శించారని, పారదర్శకంగా పంచితే రైతులకు ఇంకో నెల పెండింగ్ బిల్క్లియర్అయ్యేదని పలువురు డైరెక్టర్లు వాపోవడం గమనార్హం. కొత్త చైర్మన్బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహణ భారం పేరుతో ఎలాంటి ఆర్డర్లు లేకుండా.. కోదాడ, కందుకూరు, హాల్యా సెంటర్‌ను మూసివేశారని వర్కర్లు వాపోతున్నారు. దాంతో అక్కడి వర్కర్లను ఎండీ నిర్ధాక్షిణ్యంగా తొలగించారని, ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వర్కర్ ఆత్మహత్య చేసుకుంటున్నానని వాయిస్ రికార్డ్వాట్సాప్ గ్రూప్‌లో మంగళవారం కలకలం రేపింది.ఇదంతా చైర్మన్‌కు తెలిసినా.. రాజకీయ అండదండలతో చైర్మన్ సీటు ఎక్కినా.. ఆయన సొంత నిర్ణయాలతో డెయిరీని అభివృద్ధి చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.
మూత దిశగా నార్ముల్ డెయిరీ..?
పాడి రైతులకు ఉపాధే లక్ష్యంగా పురుడు పోసుకున్న నల్లగొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్(నార్ముల్) ఇక మూత పడుతుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో వనరులు ఉన్న ఈ డెయిరీ ఒక ఎండీ నియంతృత్వ పోకడలతోనే మనుగడ ప్రమాదంలో పడుతుందని, ఎండీని వెంటనే తొలగిస్తే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని పలువురు ఉద్యోగులు, డైరెక్టర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎండీని మారిస్తే.. నార్ముల్ డెయిరీ లాభాల బాట పడుతుందని చెబుతున్నారు.






