సీఎం తీరును నిరసిస్తూ ఔటర్ పై వాహనదారుల నిరసన

by Taduka Kalyani |

ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనదారులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి వస్తున్నారని పోలీసులు వాహనదారులను గంటల తరబడి నిలిపివేయడంతో కార్ల హారన్ మోగిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం తీరును నిరసిస్తూ ఔటర్ పై వాహనదారుల నిరసన
X

దిశ, గండిపేట: ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనదారులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి వస్తున్నారని పోలీసులు వాహనదారులను గంటల తరబడి నిలిపివేయడంతో కార్ల హారన్ మోగిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జనవాడ, తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లలో జరుగుతున్న వివాహాది శుభకార్యాలకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రహదారి మీదుగా వస్తుండడంతో గంటల తరబడి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోతుంది. అత్యవసర పనులపై వెళ్లే వారి పరిస్థితి దయనీయంగా మారిందని వాహనదారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధి నిత్యం ఇక్కడి ప్రాంతంలో వివాహాలు, శుభకార్యాలకు హాజరు కావడంతో పోలీసులతో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో సీఎం వస్తున్నారంటూ పోలీసులు సుమారు గంటకు పైగా రహదారిపై వాహనదారులను నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర స్థాయిలో సీఎం తీరుపై ధ్వజమెత్తారు. ఇదేంటి అని పోలీసులను ప్రశ్నించగా ఎక్కువ మాట్లాడితే లోపల వేస్తామంటూ.. స్థానిక పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పుప్పాలగూడ ఔటర్ సర్వీస్ రోడ్డు వద్ద వాహనదారులు వందలాదిమంది తమ కార్ల హారన్ కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. గంటకు పైగా రహదారిపై వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు రహదారిపై వాహనాలు నిలిపివేయడంతో సీఎంపై శాపనార్థాలు పెడుతూ కనిపించారు.

Next Story