- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమీషన్ పైసలివ్వరా? సివిల్ సప్లై కార్పొరేషన్‌పై ఐకేపీ సభ్యుల ఫైర్
సివిల్ సప్లై కార్పొరేషన్ తీరుపై ఐకేపీ గ్రూపు సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ,తెలంగాణ బ్యూరో : సివిల్ సప్లై కార్పొరేషన్ తీరుపై ఐకేపీ గ్రూపు సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణలో ఐకేపీ గ్రూపులు కీలకంగా వ్యవహరిస్తుంటాయి. రైతులకు అనుకూలమైన ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటాయి. అందుకు ఐకేపీ గ్రూపులకు కార్పొరేషన్ క్వింటాలుకు రూ.32 చొప్పున కమీషన్ ఇవ్వాలి. కానీ, ప్రతి సీజన్‌లో కమీషన్ డబ్బులు నిర్ణీత సమయంలో ఇవ్వకుండా ఐకేపీ గ్రూపులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి.
లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫిర్యాదులు..
ఈ ఏడాది వర్షాకాలంలో సేకరించిన వరి ధాన్యానికి సంబంధించిన రూ.30 కోట్ల కమీషన్ డబ్బులు ఇవ్వాలంటూ సివిల్ సప్లై కార్పొరేషన్‌కు ఐకేపీలను పర్యవేక్షించే పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పలుసార్లు లేఖలు రాశారు. అదిగోఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్పా నిధులు మాత్రం విడుదల చేయడం లేదని తెలుస్తున్నది. ధాన్యం సేకరణ కోసం మహిళా సంఘాలు అందించే గోనే సంచుల లెక్కల్లో తేడా వస్తే అంతమేరకు డబ్బులు పట్టుకుని మిగతా నిధులను ఐకేపీ గ్రూపులకు చెల్లిస్తుంటారు. కానీ వానాకాలానికి సంబంధించిన గోనె సంచుల లెక్కల్లో క్లారిటీ వచ్చిన తర్వాత కూడా తమకు డబ్బులు ఇవ్వడం లేదని కొందరు ఐకేపీ గ్రూపు సభ్యులు స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనితో సమస్య ఎక్కడుందో తెలుసుకుని ప్రయత్నం చేయగా, సివిల్ సప్లై కార్పొరేషన్ తీరుతోనే నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందనే విషయాన్ని సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు గుర్తించినట్టు తెలిసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ముగిసిన యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 2,961 ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయగా.. అందులో 16 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించారు. అందుకు ఐకేపీ గ్రూపులకు సుమారు రూ.52 కోట్ల కమీషన్‌ను సివిల్ సప్లై కార్పొరేషన్ చెల్లించాల్సి ఉన్నది.






