- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాయింట్ సర్వే పేరుతో జాప్యం.. పటేల్ చెరువు కబ్జాపై యాక్షన్ ఇంకెప్పుడు?
మదీనాగూడ పటేల్ చెరువు నిషేధిత బఫర్ జోన్‌లో ‘లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్’ సాగిస్తున్న అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మదీనాగూడ పటేల్ చెరువు నిషేధిత బఫర్ జోన్‌లో ‘లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్’ సాగిస్తున్న అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పక్కా ఆధారాలతో ఫిర్యాదులు వస్తున్నా.. కళ్లముందే అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా.. ‘జాయింట్ సర్వే’ ముసుగులో చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో చెరువులు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి.
ఇరిగేషన్.. వెనకడుగు వేస్తోందా?
లోటస్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ నిర్మాణాలను హుస్సేన్ సాగర్ లేక్స్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు 2026 జనవరి 23 న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్వయంగా స్థలాన్ని పరిశీలించారు. పటేల్ చెరువు బఫర్ జోన్ పరిధిని ఆక్రమించి కాంపౌండ్ వాల్, అపార్ట్‌మెంట్ పిల్లర్లు, స్లాబులను నిర్మించారని రికార్డుల సాక్షిగా తేల్చారు. ఈ ఆక్రమణలపై ‘ఇరిగేషన్ యాక్ట్ 1357 ఎఫ్’ లోని క్లాజ్-52 ప్రకారం తక్షణమే నోటీసులు జారీ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి తహసీల్దార్, మియాపూర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, హైడ్రా కమిషనర్‌కు అధికారిక లేఖలు (ఎల్ఆర్ నం. 139, తేదీ 07.02.2026) పంపారు. లేఖలు పంపి నెలలు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
జాయింట్ సర్వే పేరిట
‘పటేల్ చెరువు బఫర్ జోన్ ఆక్రమణలపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. మేము ప్రాథమికంగా పరిశీలించాం. అయితే, ఇరిగేషన్ శాఖకు నేరుగా కూల్చివేతలు చేపట్టే అధికారాలు లేవు. అందుకే రెవెన్యూ, టాస్క్ ఫోర్స్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు లెటర్లు రాశాం. త్వరలోనే అన్ని శాఖల అధికారులతో కలిసి ‘జాయింట్ సర్వే’ చేసి, ఆక్రమణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఇరిగేషన్ అధికారులు గతంలోనే ప్రకటించారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ను పక్కన పెట్టి, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డర్ చేతిలో ‘ప్లాన్ అప్రూవల్’ పెట్టేశారు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖేమో మున్సిపాలిటీ, రెవెన్యూ వైపు వేలెత్తి చూపిస్తుంటే.. మున్సిపల్ అధికారులేమో ఇరిగేషన్ వారు జాయింట్ సర్వేకి పిలిస్తేనే వెళ్తామంటూ సాకులు వెతుకుతున్నారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు నెపాన్ని వేసుకుంటూ కాలయాపన చేస్తుండటంతో, బిల్డర్ ఆ గ్యాప్‌లో అక్రమ నిర్మాణాన్ని పూర్తి చేసి, అమాయక కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించే పనిలో పడ్డారు.
అధికారుల ఉదాసీనత..
ప్రభుత్వ నిబంధనల (జీవో 168) ప్రకారం చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. చట్టం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వ శాఖ ఆక్రమణలు జరిగాయని రాతపూర్వకంగా తేల్చినప్పుడు, జాయింట్ సర్వేల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఏముంది? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మామూళ్ల మత్తులోనే అధికారులు కళ్లు మూసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సమగ్ర సాక్ష్యాలు, అధికారుల లేఖల ఆధారంగా త్వరలోనే బాధ్యులైన అధికారులందరినీ కోర్టు బోనులో నిలబెట్టేందుకు బాధితులు, పర్యావరణ ప్రేమికులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, కాలయాపన ముసుగును తొలగించి పటేల్ చెరువును కాపాడతారో లేదో వేచి చూడాలి.






