- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత నగరాన్ని ఒరిజినల్ సిటీగా మారుస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, రాజేంద్రనగర్: జంట నగరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శాస్త్రిపురం రోడ్డు ఓవర్ బ్రిడ్జిని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రహమత్ భైగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ లతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 490 మీటర్ల పొడవు, 16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఈ ఆర్‌వోబీని నిర్మించారు. మైలార్‌దేవ్‌పల్లి నుంచి వట్టేపల్లి మీదుగా ఫలక్‌నుమా ఆర్టీసీ డిపోలను అనుసంధానించే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వం రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసి పూర్తి చేయలేకపోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం మొదలుపెట్టి ప్రారంభించిన పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని వెల్లడించారు.
హర్షం వ్యక్తం చేస్తోన్న స్థానిక ప్రజలు
ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాత నగరాన్ని ఒరిజినల్ సిటీగా మారుస్తామన్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో టూరిస్టులను ఆకర్షించుకునే విధంగా వసతులు మరింత మెరుగుపరుస్తామన్నారు. మాటలకు పరిమితం కాకుండా పెండింగ్లో ఉన్న పనులన్నింటిని పూర్తి చేసి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. శాస్త్రిపురం ఆర్ఓ బి అందుబాటులోకి రావడంతో మైలార్‌దేవ్‌పల్లి నుంచి వట్టేపల్లి మీదుగా ఫలక్‌నుమా ఆర్టీసీ డిపోకు ప్రయాణించే వారికి 30 నిమిషాల సమయం ఆదా కానుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తికావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ ఇంద్రపాల్ రెడ్డి, ప్రేమ్ గౌడ్, భాస్కర్ గౌడ్, బాస శ్రీనివాస్, అడికే అర్జున్, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.






