విలీన మున్సిపాలిటీలకు మహర్దశ

by velandi.Saikiran |   (  Updated:2026-01-31 22:00:42  IST  )

జీహెచ్‌ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ప్రవేశపెట్టిన 2026-27 జీహెచ్‌ఎంసీ ఆర్థిక ఏడాది బడ్జెట్‌‌లో విలీన మున్సిపాలిటీలకు సింహభాగం నిధులు కేటాయించింది.

విలీన మున్సిపాలిటీలకు మహర్దశ
X

విలీన మున్సిపాలిటీలకు మహర్దశ

27 మున్సిపాలిటీలకు రూ.2,260కోట్ల బడ్జెట్‌ కేటాయింపు

జిల్లాలోని 8 విలీన మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల అభివృద్ధి

మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పెరగనున్న పట్టణీకరణ

రియల్‌‌ఎస్టేట్‌ రంగానికి సైతం మేలు జరిగే అవకాశం

దిశ, రంగారెడ్డి బ్యూరో : జీహెచ్‌ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ప్రవేశపెట్టిన 2026-27 జీహెచ్‌ఎంసీ ఆర్థిక ఏడాది బడ్జెట్‌‌లో విలీన మున్సిపాలిటీలకు సింహభాగం నిధులు కేటాయించింది. విలీనమైన 27 మున్సిపాలిటీలకు గాను రూ.2,260 కోట్ల బడ్జెట్‌‌ను కేటాయించింది. దీంతో జీహెచ్‌ఎంసీలో విలీనమైన రంగారెడ్డి జిల్లాకు చెందిన 8 మున్సిపాలిటీలు, 3 కార్పోరేషన్లు శరవేగంగా అభివృద్ధి జరగనున్నది. విలీనమైన వాటిల్లో కొన్ని జోన్లుగా, మరికొన్ని సర్కిల్‌ కార్యాలయాలుగా, డివిజన్లుగా మారాయి. కొత్త రూపు సంతరించుకున్న ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణను రూపొందించేందుకు సిద్దమవుతోంది.

సరికొత్త పాలన..

ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650చ.కి.మీటర్లు. దీన్ని ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించడంతో జీహెచ్‌ఎంసీ పరిధి 2,200చ.కి.మీటర్లకు పెరిగింది. హైదరాబాద్‌ నగరంలోనే ఓ భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో, జీహెచ్‌ఎంసీ పాలనలో వ్యత్యాసం ఉండడం.. దీనివల్ల సమన్వయం లోపించి నగరాభివృద్ది ప్రణాళికాబద్దంగా జరగట్లేదని ప్రభుత్వం భావించి విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేయడానికి ముందు ఓఆర్‌ఆర్‌ లోపల, బయట ఉన్న కొన్ని పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేసేందుకు గత ఏడాదే ఆర్డినెన్స్‌‍ను తీసుకొచ్చారు. ఈ మేరకు బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్‌, తారామతి పేట పంచాయతీలు పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. అలాగే..శంషాబాద్‌ మున్సిపాలిటీలో బహదూర్‌‌గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, హమీదుల్లా నగర్‌, రషీద్‌ గూడ, ఘంసీమియాగూడ పంచాయతీలు విలీనం అయ్యాయి. మీర్జాగూడ గ్రామపంచాయతీ నార్సింగి మున్సిపాలిటీలో, హర్షగూడ గ్రామపంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న శంషాబాద్‌, పెద్ద అంబర్‌‌పేట్‌, తుర్కయంజాల్‌, జల్‌‌పల్లి, తుక్కుగూడ, ఆదిభట్ల, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలను బడంగ్‌‌పేట, మీర్‌‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. ఇవన్నీ జోన్లుగా, సర్కిల్‌ కార్యాలయాలుగా, డివిజన్లుగా మారి పాలన అందిస్తుండడాన్ని ప్రజానీకం సైతం స్వాగతిస్తోంది.

అభివృద్ధి వేగవంతం..

జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియ పూర్తవడంతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు అనుగుణంగానే జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో భారీ కేటాయింపులను సైతం జరిపింది. పెరగనున్న మౌలిక వసతులతో పట్టణీకరణ సైతం గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం పారిశుద్ద్యం, నీటి సరఫరా వంటి సేవలతో పాటు టీ ఫైబర్‌, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ వంటి అత్యాధునిక సదుపాయాలకు సంబంధించిన పనులు వేగవంతం కానున్నాయి. పౌర సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించబడడంతో పాటు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాల అభివృద్దితో రియల్‌‌ఎస్టేట్‌ రంగం సైతం ఊపందుకుని ప్రజల జీవన ప్రమాణాలు సైతం మెరుగుపడనున్నాయి.

Next Story