విలాసవంతమైన నిర్మాణాలు.. పెద్దల పేరుతో దమ్కీలు

by Yella Dhawani Reddy |

విలాసవంతమైన కట్టడాల కోసం 111 జీవో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అర్ధబలం, రాజకీయ బలం ఉండటంతో అడిగేవారి పట్ల ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.

విలాసవంతమైన నిర్మాణాలు.. పెద్దల పేరుతో దమ్కీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడాబాబులు ధనబలంతో నిబంధనల అడ్డుగోడలను యథేచ్ఛగా దాటేస్తున్నారు. విలాసవంతమైన కట్టడాల కోసం 111 జీవో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అర్ధబలం, రాజకీయ బలం ఉండటంతో అడిగేవారి పట్ల ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇది రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జనవాడ గ్రామంలో జరుగుతున్న తతంగం. బడాబాబులు కొందరు నార్సింగి- శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై సుమారు 10 ఎకరాల స్థలంలో జీవోనెం.111 రూల్స్‌కు విరుద్ధంగా ఓ భారీ కన్వెన్షన్ హాల్ నిర్మించారు. అలాగే సుమారు 20 విలాసవంతమైన కాటేజీలను నిర్మిస్తున్నారు. ఎప్పుడో ముగిసిన పంచాయతీ పాలకవర్గం అనుమతులు తీసుకున్నామని బుకాయిస్తున్నారు.

జీవో 111 ఏం చెబుతుంది?

నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని చాలా ప్రాంతం జీవో 111 పరిధిలో ఉంటుంది. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు నిజాం పాలకుల కాలంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ నిర్మించారు. చాలా ఏళ్ల వ‌ర‌కు ఈ జలాశయాలే భాగ్యనగరం తాగునీటి అవ‌స‌రాలను తీర్చాయి. కాగా, ఈ జ‌లాశ‌యాల‌ను క‌లుషితం, క‌బ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి స‌ర్కారు జీవో 111 తీసుకొచ్చింది. కలుషితం చేసేలా ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఇక్కడ పంచాయతీ పర్మిషన్లు కూడా పనిచేయవు. ఈ జీవో కిందికి 84 గ్రామాలు వ‌స్తాయి. పంట చేలకు పురుగు మందులను వాడకూడదు. ఇదంతా బ‌యో క‌న్జర్వేష‌న్ జోన్‌గా నిర్దేశించారు.

అడ్డగోలు నిర్మాణాలు

కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకొని తమ పనులు దర్జాగా కానివ్వడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడంతో పాటు నిర్వాహకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రధాన రహదారిపై కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. దానికి వెనక పెద్దఎత్తున విలాసవంతమైన కాటేజీల నిర్మాణం చకచకా జరుగుతున్నది. ఇదంతా సుమారు ఆరు నెలల కంటే ముందు నుంచే నిర్మాణాలు కొనసాగుతుండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా సాగుతున్న నిర్మాణాల గురించి నిర్వాహకులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఇది ఓ పెద్ద ప్రజాప్రతినిధికి చెందిన నిర్మాణం అంటూ దబాయించడం గమనార్హం. ‘ఆయనతో మాట్లాడతావా.. దమ్ముందా.. ఆర్డీవోతో మాట్లాడతావా.. ఎమ్మెల్యేతో మాట్లాడతావా.. మంత్రులతో మాట్లాడతావా?’ అంటూ నిర్వాహకులు దబాయిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలను కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story