ఉత్కంఠకు తెర.. స్థానిక సంస్థల రిజర్వేషన్ల లిస్ట్ ఇదే

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-28 02:25:00  IST  )

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడింది.

ఉత్కంఠకు తెర.. స్థానిక సంస్థల రిజర్వేషన్ల లిస్ట్ ఇదే
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అనుసరించి అధికార యంత్రాంగం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. అయితే రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన చోట ఆశావాహులు ఆనందంతో ఉండగా.. ప్రతికూలం చోట ఆశావహులు నైరాశ్యంలో పడిపోయారు. రిజర్వేషన్ల పెంపు వ్యవహారం కోర్టుకు చేరడంతో.. షెడ్యూల్‌ విడుదలపై సందిగ్ధత నెలకొంది.

21 ఎంపీపీ, జడ్పీటీసీలకు రిజర్వేషన్లు ఖరారు

రంగారెడ్డి జిల్లాలో 21 ఎం పీపీ, 21 జడ్పీటీసీ స్థానాలకు జిల్లా అధికార యంత్రాంగం శనివారం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల రిజర్వేషన్లకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నారాయణ రెడ్డి లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఆయా రిజర్వేషన్లపై గెజిట్‌ విడుదల చేశాక సంబంధిత ఫిజికల్‌ కాపీలను పంచాయతీరాజ్‌ శాఖకు పంపించారు. సంబంధిత అధికారులు ఆయా వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయనున్నారు. జిల్లాలోని 21 చొప్పున ఉన్న ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీ-3, ఎస్సీ-4, బీసీ-9, జనరల్‌-5 చొప్పున రిజర్వ్ చేశారు. ఇందులో 9 చొప్పున మహిళలకు రిజర్వ్ చేశారు. ప్రభుత్వం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనుంది. ఆ తర్వాత సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు ఉంటాయి. ఇదిలా ఉండగా.. జడ్పీ చైర్మన్ స్థానం సైతం ఎస్సీకి రిజర్వ్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

రిజర్వేషన్ల ఖరారుతో ఎన్నికల సందడి

రంగారెడ్డి జిల్లాలో గతేడాది జూలైలో ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. ఒక్క రోజు తేడాతో జడ్పీటీసీల పదవీ కాలం పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. గతంలో ప్రభుత్వం తొలుత సర్పంచుల ఎన్నికలను నిర్వహించాలని సంకల్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిని పక్కన పెట్టి పరిషత్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. అధికార యంత్రాంగం సైతం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. పోలింగ్‌ బూత్‌‌ల వారీగా బీఎల్‌వోలను నియమించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీ, శాసన మండలిలో ఆమోదం తెలపగా.. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్‌ వద్ద పెండింగ్‌‌లో ఉంది. ఇది ఇలా ఉండగానే.. ప్రభు త్వం 42 శాతం రిజర్వేషన్లపై జీవో 9ను శుక్రవారం జారీ చేసింది. దీంతో వెనువెంటనే జిల్లా యంత్రాంగం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా.. విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. ఆ తర్వాతే షెడ్యూల్‌ విడుదలపై స్పష్టత రానుంది. రిజర్వేషన్లు కొలిక్కి రావడంతో ఎవరికి వారుగా ఆశావహులు బరిలో నిలవడంపై తెలిసిన వాళ్లతో చర్చలు జరపడం మొదలు పెట్టారు. దీంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైనట్లైంది. మహిళా రిజర్వేషన్లపై రంగారెడ్డి కలెక్టర్ డ్రా తీయగా.. రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ ఎస్సీ మహిళ కు, వికారాబాద్ బీసీ జనరల్ రిజర్వ్ అయ్యింది.

వికారాబాద్ జెడ్పీ చైర్మన్ బీసీ రిజర్వేషన్‌

దిశ, వికారాబాద్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 20 మండలాలకు జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటితో పాటు ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ప్రభుత్వం అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో 20 మండలాలకు 8 మండలాలకు 8 జడ్పీటీసీ, 8 ఎంపీపీ స్థానాలను బీసీ రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది. ఇందులో 4 జడ్పీటీసీ, 4 ఎంపీపీ స్థానాలు బీసీ మహిళలకు కేటాయించడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ కింద రెండు స్థానాలు జడ్పీటీసీ, రెండు స్థానాలు మహిళా ఎస్సీ రిజర్వేషన్ ఖరారు చేశారు. ఎంపీపీ స్థానాలు కూడా రెండు ఎస్సీ, రెండు ఎస్సీ మహిళకు కేటాయించారు. ఎస్టీలకు రెండు జడ్పీటీసీ, రెండు ఎం పీపీ స్థానాలు కేటాయించగా, అందులో ఒకటి ఎస్టీ, ఒకటి ఎస్టీ మహి గా ఖరారు చేశారు. మిగతా 6 మండలాల జడ్పీటీసీ, ఎంపీటీ స్థానాలను జనరల్ కేటగిరిగా నిర్ధారించారు. అందులో 3 జనరల్, 3 జనర ల్మహిళా స్థానాలుగా నిర్ధారించారు. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల విషయానికొస్తే బీసీలకు 8 జడ్పీటీసీ, 8 ఎంపీపీ స్థానాలు, ఎస్సీలకు 4 జడ్పీటీసీ, 4 ఎంపీపీ, ఎస్టీలకు రెండు జడ్పీటీసీ, రెండు ఎంపీపీ స్థానాలు, మి గతా 6 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను జనరల్ కేటగిరీ కింద కేటాయించారు.

Next Story