పల్లె పోరుకు రె‘ఢీ’..

by velandi.Saikiran |   (  Updated:2025-11-25 23:15:45  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీ

పల్లె పోరుకు రె‘ఢీ’..
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో 1,120 పంచాయతీలకు, 9,726 వార్డులకు ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది.

మూడు విడతల్లో ఎన్నికలు..

పంచాయతీ, వార్డులకు డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. నోటిఫికేషన్‌ విడుదలతో ఎన్నికల కోడ్‌ సైతం అమలులోకి వచ్చింది.

పల్లెల్లో రాజకీయ వేడి..

కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రిజర్వేషన్లు అనుకూలించని వారిలో నైరాశ్యం నెలకొనగా.. రిజర్వేషన్లు అనుకూలించిన చోట ఆశావహులు ఇప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టికెట్‌ కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీల నాయకులు కూడా ఎవరెవరిని ఎక్కడ పోటీలో పెడితే ప్రయోజనం ఉంటుందన్న కోణంలో వ్యూహ రచన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎస్టీకి 91 సర్పంచు స్థానాలు, ఎస్సీకి 106, బీసీకి 92, జనరల్‌కు 237 స్థానాలను కేటాయించారు. మొత్తంగా 247 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. గెలుపు గుర్రాల కోసం రాజకీయ పార్టీలు అన్వేషణను ముమ్మరం చేశాయి.

మొదటి విడతలో ఎన్నికలు జరిగే మండలాలు..

మొదటి విడతలో కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూక్‌ నగర్‌, శంషాబాద్‌ మండలాల్లోని 174 గ్రామ పంచాయతీలు, 1,530 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

రెండో విడతలో..

శంకర్‌ పల్లి, మొయినాబాద్‌, చేవెళ్ల, షాబాద్‌, ఆమన్‌ గల్‌, కడ్తాల్‌, తలకొండపల్లి మండలాల్లోని 178 గ్రామ పంచాయతీలు, 1,540 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

మూడో విడతలో..

అబ్దుల్లాపూర్‌ మెట్‌, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని 174 గ్రామ పంచాయతీలు, 1,598 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

రంగారెడ్డి జిల్లా వివరాలు..

గ్రామ పంచాయతీలు 526

వార్డులు 4,668

పోలింగ్‌ కేంద్రాలు 4,682

మొత్తం ఓటర్లు 7,94,653

పురుషులు 3,99,404

మహిళలు 3,95,216

ఇతరులు 33

వికారాబాద్‌ జిల్లా వివరాలు..

గ్రామ పంచాయతీలు 594

వార్డులు 5,058

పోలింగ్‌ కేంద్రాలు 5,058

మొత్తం ఓటర్లు 6,98,478

పురుషులు 3,43,672

మహిళలు 3,54,790

ఇతరులు 16

Next Story