విచ్చలవిడిగా ఎర్రమట్టి దందా..రాత్రి సమయాల్లోనే మట్టి విక్రయాలు

by Disha Web Desk 23 |
విచ్చలవిడిగా ఎర్రమట్టి దందా..రాత్రి సమయాల్లోనే మట్టి విక్రయాలు
X

దిశ, అబ్దుల్లాపూర్​ మెట్టు: ఓ వైపు రియల్​ ఎస్టేట్​... మరో వైపు ఎర్రమట్టి వ్యాపారులు కుమ్మక్కై ఇష్టానుసారంగా తొవ్వకాలు చేస్తున్నారు. భూమి చదును చేసేందుకు రియల్​ వ్యాపారులు ప్రయాత్నం చేస్తుంటే అదే అదునుగా తీసుకొని టిప్పర్​ యాజమాన్యులు ప్రైవేటు​ వ్యక్తులకు విక్రయాలు జరిపి నగదును సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలపై స్ధానికులు పిర్యాదులు చేస్తే ఆధారాలతో చూపించాలని అధికారులు సమాధానం చెప్పి దాట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్​ మెట్టు మండల పరిధిలో ఈ ఎర్రమట్టి దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ దందాల వెనుక స్థానిక రెవెన్యూ కార్యాలయంలోని కొంత మంది సిబ్బంది కలిసి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎర్రమట్టి దందానే కాకుండా అక్రమంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించే గృహాలపైన వసూళ్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

టిప్పర్లతో డంపింగ్​...

ఎర్రమట్టి దందా చేసే యాజమాని ఉదయం గీరాకి మాట్లాడుకోవడం, రాత్రి సమయంలో విక్రయాలు జరపడం ఆలవాటుగా మారిపోయింది. ఆ ఎర్రమట్టి సప్లై​ చేసే యాజమాని కేవలం అబ్ధూల్లాపూర్​ మెట్టు మండలంలోనే కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఏ గుట్ట, పుట్టను వదలకుండా తవ్వకాలు చేస్తున్నారు. మైనింగ్​ అధికారులకు ఫిర్యాదు చేసిన చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు. ఒక టిప్పర్​ మట్టి రూ.1200లకు పైమాటే అంటున్నారు. మున్సిపాలిటీల పరిధిలో నిర్మించే గృహా అవసరాలకు ఈ ఎర్రమట్టిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా ఉచితంగా ప్రభుత్వ సొమ్మును కాజేసుకుంటున్నారు. అంతేకాకుండా పదుల సంఖ్యల్లో టిప్పర్ మట్టిని ఒకే దగ్గర డపింగ్​ చేసి విక్రయాలు చేస్తున్నారు.

రాత్రి సమయాల్లే టార్గెట్​...

వెంచర్ అభివృద్ధికి అనుమతులు రాకముందే అభివృద్ధి పేరిట రాత్రి సమయాల్లో మట్టి విక్రయాలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలు సెలవు దినాల్లో కూడా ఇదే పనిగా సాగుతుంది. రెవెన్యూ, మైనింగ్​ విభాగంలో పనిచేసే అధికారి, సిబ్బంది సూచనల మెరకే తెలివిగా మట్టి తరలింపు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. అబ్దుల్లాపూర్మెట్ మండలం బాట సింగారం గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 376 లో గల పది ఎకరాలలో వెంచర్ ను ఏర్పాటు చేసేందుకు వెంచర్ యజమాని గుట్టకు ఎసరు పెట్టారు. గుట్టకు అనుకొని ఉన్న ఈ స్థలం లో వెంచర్ గా ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటుందని దాన్ని అభివృద్ధి చేసేందుకు గాను రాత్రి సమయంలో టిప్పర్ల సహాయంతో మట్టిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతులు వచ్చిన తర్వాత చేపట్టాల్సిన పనులను అభివృద్ధి పేరిట పెద్ద పెద్ద జెసిబి లతో గుట్టలను తవ్వకానికి పెట్టారు.

కనీసం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆలోచన సైతం లేకుండా పెద్ద పెద్ద రాళ్లను గుండ్లను కంప చెట్లను పెద్ద ఎత్తున చెట్లను తొలగించేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సరైన విధంగా సర్వే చేయకుండానే గుట్ట మొత్తం తన పరిధిలోకి వస్తుంది అన్న భావనతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి మట్టిని విక్రయాలు జరుపుతూ లక్షల గడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తెలిసిన రెవెన్యూ అధికారులు సైతం అంతగా పట్టించుకున్న దాఖలాలు ఏమి కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా అనుమతులు రాకముందే గుట్టకు తవ్వకాలు పెట్టి పర్యావరణాన్ని భక్షిస్తున్న సదర్ వెంచర్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మట్టి తవ్వకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను వివరణ కోరేందుకు ‘దిశ’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed