బతికుండగానే చంపారు.. చనిపోయాక రిజిస్ట్రేషన్‌ చేశారు

by Thanuru Gopichand |

అవినీతి బ్రతికి ఉన్న వారిని కూడా సర్టిఫికెట్లలో చంపేస్తుంది.

బతికుండగానే చంపారు.. చనిపోయాక రిజిస్ట్రేషన్‌ చేశారు
X

దిశ, బషీరాబాద్‌ : ఆమె ఓ అనాథ. ఆమె పేరున ఉన్న లక్షల విలువజేసే భూమిపై ఒకరి కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని కాజేయాలని పన్నాగం పన్నాడు. ఆమె ఏడాది క్రితం చనిపోగా.. పదేళ్ల క్రితమే చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించాడు. ఆమె చనిపోయిన వెంటనే ఆ భూమిని ఆ వ్యక్తి తన పేరున మార్చుకున్నాడు. ఇతని అక్రమానికి రెవెన్యూ అధికారులు సైతం సలాం కొట్టారు. అసైన్డ్ భూమి హక్కుదారులు చనిపోతే.. దానిపై వారసులకు మాత్రమే హక్కు ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా తహశీల్దార్‌ గుడ్డిగా ఎలాంటి రక్త సంబంధం లేని వ్యక్తికి లక్షలు విలువ జేసే భూమిని కట్టబెట్టడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం నావంద్గి గ్రామంలో జరిగిన ఈ అక్రమంపై గ్రామస్తులు ఎంతోకాలంగా పోరాటం చేస్తూ వస్తుండగా.. రాజకీయ నేతలు దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అక్రమంగా పట్టా..

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల పరిధిలోని నావంద్గి గ్రామానికి చెందిన కమలమ్మ భర్త యాదయ్య పేరిట 1977లో సర్వే నంబర్‌ 6/17 లో ఒక ఎకరా 4 గుంటల అసైన్డ్ భూమి రికార్డులో నమోదై ఉంది. యాదయ్య 20 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో, భార్య కమలమ్మ పేరిట విరాసిత్‌ భూమిగా రిజిస్ట్రేషన్‌ చేశారు. భర్త మరణం అనంతరం కమలమ్మ ఒంటరి జీవితం గడుపుతూ 2024, జనవరిలో మండల కేంద్రంలోని ధర్మశాలలో మృతి చెందింది. ఎవరూ లేక.. అనాథ కావడంతో విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు చందాలు వేసుకొని పారిశుధ్య కార్మికులతో అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధురాలి ఆస్తిపై ఎప్పటి నుంచో కన్నేసిన నావంద్గి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ రెడ్డి ఆమె పేరుపై ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అప్పటి తహశీల్దార్‌ ఎలాంటి విచారణ జరపకుండా అనాథ వృద్ధురాలి పేరు మీద ఉన్న అసైన్డ్ భూమిని ప్రశాంత్‌ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో స్థానికులు కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అయినా జిల్లా స్థాయి అధికారులు విచారణ చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విచారణ జరిపితే తేలనున్న నిజానిజాలు..

వృద్ధురాలు కమలమ్మ మండల కేంద్రంలోని ధర్మశాలలో ఒంటరిగా జీవనం కొనసాగిస్తూ జనవరి 2024లో మృతి చెందింది. అయితే ఆమె 2014లోనే మరణించినట్లు ధ్రువీకరణ పత్రం ఉంది. ఫోర్జరీ సంతకాలతో మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించినట్లు ఆరోపణలు విన్నిస్తున్నాయి. దీనిపై నాటి పంచాయితీ కార్యదర్శి ఎండీ ఇస్మాయిల్‌ స్పందించారు. 2014లో కమలమ్మ పేరు మీద ఎలాంటి మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. పంచాయతీ కార్యాలయంలోని జనన, మరణాల రికార్డులను పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తానని కార్యదర్శి తెలిపారు.

అక్రమానికి అధికార పార్టీ అండదండలు..

మృతి చెందిన కమలమ్మతో ఎలాంటి రక్త సంబంధం లేకున్నప్పటికీ ప్రశాంత్‌ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంపై కొందరు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టును సైతం ఆశ్రయించారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తికి, బషీరాబాద్‌ పోలీసులకు సైతం న్యాయస్థానం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే అధికారులు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సదరు వ్యక్తి అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధిని ఆశ్రయించినట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యక్తి సైతం అధికార పార్టీకి చెందిన వారే కావడంతో అధికార పార్టీ నేత నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు నిజానిజాలను తేల్చి కాజేసిన అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకొని నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం పంపిణీ చేయాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నది.

Next Story