కోహెడ భూ రైతుల‌కు న్యాయం చేయాలి

by Ratna Kumari |

కోహెడ భూ రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్ర‌వారం కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కోహెడ భూ రైతుల‌కు న్యాయం చేయాలి
X

దిశ, ఇబ్రహీంపట్నం : కోహెడ భూ రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్ర‌వారం కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం ఇప్పటికే కేటాయించిన భూమిని పక్కనబెట్టి, ప్రస్తుతం సర్వే నం. 167/1లో సుమారు 264 ఎకరాల భూమిని తీసుకుంటున్న సందర్భంగా.. ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 160 మంది రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఈ భూమిలో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విధంగా సరైన నష్టపరిహారం అందించి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ ను కోరినట్టు తెలిపారు. అలాగే జూన్ 3న ఫ్రూట్ మార్కెట్‌కు శంకుస్థాపన జరగనున్నట్లు సమాచారం అంద‌డంతో ఆలోపు పేద రైతుల జీవన భద్రతను పరిరక్షించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, సమస్యపై ప్రశ్నిస్తున్న అమాయక రైతులపై అరెస్టులు, బెదిరింపులు, దాడుల వంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Next Story