మత సామరస్య వేదిక జేపీ దర్గా..

by I. Sairam |

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామ పరిధిలో ఉన్న జేపీ దర్గా ఆధ్యాత్మికతకు చిరునామాగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

మత సామరస్య వేదిక జేపీ దర్గా..
X

దిశ, కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామ పరిధిలో ఉన్న జేపీ దర్గా ఆధ్యాత్మికతకు చిరునామాగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఈ నెల 15,16,17 తేదీల్లో వార్షిక ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. దీని కోసం జేపీ దర్గా సర్వంగ సుందరంగా ముస్తాబవుతోంది.

వందల ఏళ్ల చరిత్ర..

ఈ దర్గా చరిత్ర వందల ఏళ్ల నాటిది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నుండి హజరత్ సయ్యద్ జహంగీర్ పీరాన్, హజరత్ సయ్యద్ బుర్హానుద్దీన్ అనే ఇద్దరు సూఫీ సాధువులు శాంతిని, ఇస్లాం ధర్మాన్ని బోధించడానికి ఈ ప్రాంతానికి వచ్చారని స్థానికులు చెపుతుంటారు. వారు తమ జీవిత కాలమంతా ఇక్కడే గడిపి, ఇక్కడే తుది శ్వాస విడిచారని ఇక్కడి స్థానికుల నమ్మకం. వారి పవిత్ర సమాధులే నేడు లక్షలాది మందికి ఆరాధ్య దైవాలై ‘జహంగీర్ పీర్ దర్గా’గా విరాజిల్లుతున్నాయి.

నమ్మకం.. మహిమ.. మొక్కులు

ఎలాంటి సమస్యలున్నా, ఇక్కడి సాధువులను దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ మొక్కు చెల్లించుకుంటానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. 2017లో 50 పొటేళ్లతో భారీ స్థాయిలో 'న్యాజ్' నిర్వహించారంటేనే ఈ దర్గా విశిష్టత ఎంటో అర్థమవుతోంది.

మూడు రోజుల వేడుకలు.. ప్రత్యేక ఆచారాలు

ఉర్సు సందర్భంగా మూడు రోజుల పాటు దర్గా ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. సాధువుల సమాధులను శుద్ధి చేసి, ఘనమైన ఊరేగింపుతో గంధాన్ని తీసుకొచ్చి సమాధులపై చల్లుతారు. సమాధులపై పట్టు వస్త్రాలు (దట్టీ) కప్పి, రంగురంగుల పుష్పాలతో అలంకరిస్తారు. రాత్రంతా ఖురాన్ పఠనం, జపమాలతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. సూఫీ సంగీతమైన ఖవాలీలు భక్తులను మైమరిపిస్తాయి.

మిశ్రమ సంస్కృతికి అద్దం పట్టే 'కందురులు'..

తెలంగాణలోని మిశ్రమ సంస్కృతికి ఈ దర్గా ఒక నిదర్శనం. ఇక్కడ ముస్లింల కంటే హిందువులే అధిక సంఖ్యలో కనిపిస్తుంటారు. ముఖ్యంగా లంబాడ కుటుంబాలు ఎడ్లబండ్లు కట్టుకుని, దూర ప్రాంతాల నుండి తరలివచ్చి'కందురులు' (మొక్కుబడులు) చెల్లించడం ఇక్కడి ప్రత్యేకత.

ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు..

దర్గా ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వాక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు చేపడుతున్నారు. భక్తుల కోసం మొబైల్ టాయిలెట్స్, శాంతి భద్రతల దృష్ట్యా దర్గా ప్రాంగణంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Next Story