అడ్డగోలుగా సెల్లార్ తవ్వకం పనులు.. మరో విపత్తుకు ఆహ్వానమా?

by Naga Rani Yarlagadda |

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో మూడున్నర ఎకరాల్లో భారీ సెల్లార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

అడ్డగోలుగా సెల్లార్ తవ్వకం పనులు.. మరో విపత్తుకు ఆహ్వానమా?
X

దిశ, రాజేంద్రనగర్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో మూడున్నర ఎకరాల్లో భారీ సెల్లార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సుమారు 30 అంతస్తుల కంటే ఎక్కువ మొత్తంలో అపార్ట్‌మెంట్ ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించిన యజమానులు.. అడ్డగోలుగా సెల్లార్ తవ్వకాన్ని చేపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరంగా భారీ హిటాచీల ద్వారా పనులు కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యలో భారీ టిప్పర్ల ద్వారా నాన్ స్టాప్ గా మట్టి తరలింపు జరుగుతోంది. అతి ప్రమాదకరంగా టిప్పర్లు వెళ్తుండటంతో స్థానికులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ లో వివేకానంద విగ్రహానికి సమీపంలో బండ్లగూడ చౌరస్తాకు చేరుకునే మార్గంలో ఎడమవైపున కొన్ని రోజులుగా భారీ ఎత్తున సెల్లార్ తవ్వకం పనులు జరుగుతున్నాయి.

అమ్మో.. బాహుబలి సెల్లార్

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయానికి అతి చేరువలో, కూతవేటు దూరంలో మూడున్నర ఎకరాల స్థలంలో భారీ సెల్లార్ పనులు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కిస్మాత్పూర్ వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం వర్షాకాలంలో ఎలాంటి సెల్లార్ పనులు చేపట్టరాదు. నాలుగు నెలల పాటు పనులు చేయొద్దనే రూల్స్ ఉన్నా కూడా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పనులు జరుగుతున్న అడిగే నాథుడు లేకుండా పోయాడని స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు..?

మూడున్నర ఎకరాల స్థలంలో అతి ప్రమాదకరంగా సెల్లార్ పనులు జరుగుతుండగా ఏమైనా ప్రమాదం జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తారా.. ? అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వీడి సెల్లార్ పనులను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఏమాత్రం తాత్సారం వహించొద్దన్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం : కమిషనర్

మూడున్నర ఎకరాల భారీ సెల్లార్ తవ్వకం పనుల విషయమై బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్రను ‘దిశ’ ప్రతినిధి వివరణ కోరారు. సెల్లార్ నిర్మాణాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాకాలంలో సెల్లార్ పనులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Next Story