- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు కింది స్థాయి సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమ నిర్మాణదారులు చెలరేగిపోతున్నారు. అనుమతులు ఓ రకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో మరో రకంగా పనులు చేస్తున్నారు. ఇరుకు రోడ్లలో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. సెట్‌బ్యాక్స్ విడిచిపెట్టడం లేదు. అంతే కాకుండా అనుమతులు పొందినదాని కంటే అదనపు అంతస్థులు నిర్మిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి అనుమతుల మేరకే నిర్మాణాలు కొనసాగుతున్నాయా ? లేదా ? అని అధికారులు పరిశీలించడం లేదు. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సర్కిల్ ఆదాయానికి భారీ గండి పడుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రాజేంద్రనగర్ సర్కిల్ లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాల వివరాలు..
శివరాంపల్లి 274 పిల్లర్ ఎదురు లైన్‌లో అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం చేపడుతున్నారు. షెడ్డు ఎదురు లైన్‌లో మరో భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనానికి అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలు పాటించకుండా సెల్లార్‌తో నిర్మాణం చేపట్టారు. ఆరాంఘర్ వద్ద వేయి గజాల్లో సెల్లార్ ప్లస్ స్టిల్ ప్లస్ ఫైవ్ అనుమతులు తీసుకొని ఏలాంటి సెట్ బ్యాక్‌లు పాటించకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. ఆరాంఘర్ రాందేవ్ బాబా దేవాలయం పక్కన వెయ్యి గజాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు.పై వాటికీ అన్నింటికీ మొదటి నోటీసు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మూడు నోటీసులు ఇచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని సమాధానం చెబుతున్నారు. అధికారులు మూడు నోటీసులు ఇచ్చే లోగా అక్రమంగా నిర్మాణం అవుతున్న రెండు షెడ్ల నిర్మాణ పనులు పూర్తి అవుతాయి.
ఓపెన్ స్పేస్ జోన్‌లో భారీ భవనాలు, షెడ్ల నిర్మాణాలు..
శివరాంపల్లి గ్రామం వీకర్ సెక్షన్ కాలనీ పూర్తిగా ఓపెన్ స్పేస్ జోన్‌లోకి వస్తుంది. శివరాంపల్లిలో భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు జారీ చేయదు. కానీ రెండు బహుళ అంతస్తులు అనుమతులు తీసుకొని నిర్మిస్తుండటం విస్మయానికి గురిచేస్తుంది. సామాన్యుడు భవన నిర్మాణం అనుమతి కోసం వెళితే ఓపెన్ స్పేస్ జోన్లోకి వస్తుందని అనుమతులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. అదే బహుళ అంతస్తులు నిర్మించే వ్యక్తులకు అనుమతులు ఏలా ఇస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం : ఏసీపీ శ్రీధర్
రాజేంద్రనగర్ డివిజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బహుళ అంతస్తులు, షెడ్ల నిర్మాణాలకు నోటీసులు జారీ చేశామని ఏసీపీ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా.. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది కొరతతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అక్రమార్కులు ఎంతటి వారైనా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు.






