కేంద్రం నిర్ణ‌యాలు రైతుల‌కు మ‌ర‌ణ శాస‌నాలు

by Disha Web Desk 20 |
కేంద్రం నిర్ణ‌యాలు రైతుల‌కు మ‌ర‌ణ శాస‌నాలు
X

దిశ‌, తుర్క‌యాంజల్‌ : రైతుల చైత‌న్యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌క్కువ అంచ‌నా వేస్తున్నార‌ని, న‌ల్ల చ‌ట్టాల‌పై రైతుల పోరాటాన్ని మోదీ గుర్తించుకోవాల‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి మ‌న్నెగూడ‌లోని బీఎంఆర్‌ సార్థ క‌న్వెన్ష‌న్ హాల్‌లో రైతు అవ‌గాహ‌న స‌ద‌స్సులో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడారు. రైతుల వీరోచిత పోరాటంతో కేంద్రం రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ద‌ని తెలిపారు. ఇప్పుడు మ‌ళ్లీ మోటార్ల ద‌గ్గ‌ర మీట‌ర్లు పెట్టాల‌ని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని, దీన్ని కేసీఆర్ తీవ్రంగా వ్య‌తిరేకించార‌ని, త‌న గొంతులో ప్రాణ‌ముండ‌గా మీట‌ర్లు బిగించలేర‌ని చెప్పార‌ని తెలిపారు.

ప్రీపెయిడ్ మీట‌ర్లు రైతాంగానికి గొడ్డ‌లిపెట్టులాంటిద‌న్నారు. ధాన్యం కొనుగోళ్ల‌నూ ప్రైవేటుప‌రం చేయాల‌ని కేంద్రం చూస్తోంద‌ని, ప్రైవేటుకు కొనుగోళ్లంటే మ‌న మ‌ర‌ణ‌శాస‌నం మ‌నం రాసుకున్న‌ట్లేన‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లో త‌ప్ప దేశంలో ఎక్క‌డా రైతు, వ్య‌వ‌సాయ అనుకూల విధానాలు లేవ‌న్నారు. బీజేపీ ప్ర‌భుత్వం ఆహార సూచీలో దేశాన్ని 107వ స్థానంలో నిల‌బెట్టింద‌ని దుయ్య‌బ‌ట్టారు. రైతు కండువాను చూపి దేశంలో ఓట్ల కోసం వాడుకున్న నాయకులు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 2014లో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులుగా ఉంటే నేడు 3.50 కోట్ల టన్నులకు చేరుకుంద‌న్నారు.

నాడు 35 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే నేడు 65 లక్షల బేళ్లకు చేరుకున్నద‌న్నారు. స్వాతంత్ర్య భారతదేశంలో రైతుబంధు ఇవ్వాలని అలోచన చేసిన ఏకైక నేత కేసీఆర్ అని, రైతుల‌కు రూ.5 లక్షల జీవితబీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమ‌న్నారు. మోదీ 2014లో అధికారం ఇస్తే రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని అన్నార‌ని, కానీ వేలు, లక్షల రెట్లు ఆదాయం పెరిగింది దేశంలో ఆదానీది మాత్రమేన‌ని ఆరోపించారు. దేశంలో ఒక్కడు ధనవంతుడైతే ప్రజలు ధనవంతులు కారని చెప్పారు.

పల్లె జీవితాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలను బలోపేతం చేయాలన్నది త‌మ ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు. తెలంగాణ రైతులు పుట్ల‌ కొద్దీ ధాన్యం పండిస్తే కేంద్రం కొనలేక చేతులెత్తేసింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు, డీసీసీబీ చైర్మ‌న్ బుయ్య‌ని మ‌నోహ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed