పెద్దషాపూర్ భూములపై హైకోర్టులో ‘స్టేటస్ కో’.. హరీష్ రావు ఆరోపణలకు కలెక్టర్ కౌంటర్

by Kema Shiva Kumar |

శంషాబాద్ పెద్దషాపూర్ భూములపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఖండించారు.

పెద్దషాపూర్ భూములపై హైకోర్టులో ‘స్టేటస్ కో’.. హరీష్ రావు ఆరోపణలకు కలెక్టర్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో భూముల గురించి మాజీమంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. పెద్దషాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 172 నుంచి 183 వరకు మొత్తం 170 ఎకరాల భూమికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు. 1954-55 సంవత్సరానికి సంబంధించిన ఖస్రా పహాణి, 1955-58 సంవత్సరాలకు సంబంధించిన చేసాల పహాణి ప్రకారం.. పెద్దషాపూర్‌లో ఉన్న పాత సర్వే నంబర్ 202కు చెందిన కొత్త సర్వే నంబర్లు 172 నుంచి 183 వరకు మొత్తం విస్తీర్ణం 170 ఎకరాలను మొదటగా పట్టా భూములుగా నమోదు చేశారని వివరించారు. అయితే రాజేంద్రనగర్ డివిజన్‌కు చెందిన ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కమ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సర్ప్లస్‌గా (Surplus) ప్రకటించిన భూములలో భాగంగా ఉన్న 74 ఎకరాల 97 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ భూములు అన్నీ ప్రస్తుతం 22-A లో నమోదు అయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. సర్వే నంబర్లు 172, 173, 174, 175, 176, 177, 179, 180, 182లలో ఉన్న మొత్తం సుమారు 94 ఎకరాల 28 గుంటల భూమికి సంబంధించి తమ పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడం, పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయకపోవడం చట్టవిరుద్ధమని వారు పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు 21-01-2025 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. 8 వారాల్లో సరైన వివరాలు అందజేయాలని, అంతవరకు భూములపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు స్వీకరించవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 02-05-2025న రిట్ పిటిషనర్లకు తమ హక్కులను సమర్థించే ఆధార పత్రాలు సమర్పించాలని మెమో జారీ చేశారు. ఆ తర్వాత 05-05-2025న వారు సంబంధిత పత్రాలను సమర్పించారు. దీంతో తహసీల్దార్ 27-05-2025 తేదీన సంబంధిత అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసి, ఆయా సర్వే నంబర్లపై తమ హక్కులను సమర్థించే ఆధారాలు సమర్పించాలని కోరారు. ఆ నోటీసుల మేరకు పలు క్లెయిమ్స్, అభ్యంతరాలు అందాయి.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు శంషాబాద్ తహసీల్దార్.. నవాబ్ మొహమ్మద్ యూసుఫుద్దీన్ ఖాన్, మరియు మరో నలుగురిని ఆ 94 ఎకరాల 28 గుంటల భూమికి యజమానులుగా ప్రకటించారు. ఆ తర్వాత ఓంకార్ క్యారియర్స్ అండ్.. మూవర్స్ సంస్థ వారు, ఇతరులు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఏప్రిల్ 16న స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములపై పిటిషనర్ల పేర్లను మ్యూటేషన్ చేసి పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయాలని ఆదేశించింది.

ఏప్రిల్ 29న హైకోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సంబంధిత భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని, తహసీల్దార్ ఎటువంటి అనుమతులు లేదా మ్యూటేషన్లు చేయవద్దని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు జూన్ 12న విచారణకు రానుంది. శంషాబాద్ తహసీల్దార్ ఉత్తర్వుల అనుసరించి భూభారతి పోర్టల్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ విషయం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో స్టేటస్ కో ఉత్తర్వులతో పెండింగ్‌లో ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story