- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harvesters: రైతన్నల వద్ద హార్వెస్టర్ల దోపిడీ..? లోకల్ యజమానుల అధిక వసూళ్లు ?
ఎంతో తిప్పలవడి కాపాడుకున్న పంటను ఇంటికి తెచ్చుకోవడానికి కర్షకులు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది.

దిశ, కొత్తూరు : ఎంతో తిప్పలవడి కాపాడుకున్న పంటను ఇంటికి తెచ్చుకోవడానికి కర్షకులు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. అధిక కూలీ రేట్లకు భయపడి హార్వెస్టర్ ను నమ్మితే ఈ యేడు నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. దీంతో ‘ఎద్దు తంతుందని గుర్రపు సాటుకు కూర్చున్న’ అనే చందంగా కొత్తూరు మండల రైతుల పరిస్థితి మారింది. మొన్నటి వరకు కురిసిన అకాల వర్షాలు, తుఫానుల వల్ల వరి, మొక్కజొన్న వంటి కీలక పంటల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్నదాతకు.. ఇప్పుడు కోత యంత్రాల (హార్వెస్టర్ల) నిర్వాహకుల తీరు ‘ఏలేవాని ఎద్దు పోతేనేం? కాచేవాని కన్ను పోతేనేం? నా ముల్లె నిండితే చాలు’ అన్నట్లు తయారైంది.
లోకల్ యజమానుల బాదుడు..
పంట కోయడానికి సమయం మించి పోతుండటం, ఎప్పుడైనా వర్షం పడవచ్చు అనే భయం రైతులను వెంటాడుతోంది. ఈ అవసరాన్ని కొందరు స్థానిక హార్వెస్టర్ల యజమానులు ఆసరాగా తీసుకుని అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక వరి కోత మిషన్ల యజమానులు గంటకు రూ.3,000 నుండి రూ.3,500 వరకు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు లేక, వడ్డీకి అప్పులు తెచ్చి కోతలు చేయించుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు.
పొరుగు రాష్ట్రాల యంత్రాల గుత్తాధిపత్యం
స్థానిక యజమానుల దోపిడీని తట్టుకోలేక కొందరు రైతులు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వరి కోత యంత్రాలపై మొగ్గు చూపుతున్నారు. తమిళనాడు నుంచి ఇతర రాష్టాల వలస వచ్చిన మిషన్లు గంటకు రూ.2,500 నుంచి రూ.2,800 వరకు చార్జీలు వసూలు చేస్తుండటంతో కొంతైనా భారం తగ్గుతుందని భావించారు.అయితే వీరు కూడా ఇప్పుడు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. గ్రామంలో ఒకరిని మధ్యవర్తిగా మాట్లాడుకుని, అతడికి అదనంగా గంటకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లిస్తూ ఆ ఊరుని గుత్తకు పడుతున్నారు. ఈ మధ్యవర్తిత్వ భారం కూడా చివరికి రైతులపైనే మోపబడుతోంది. ఒకవైపు దిగుబడి నష్టం, మరోవైపు కోత యంత్రాల అధిక చార్జీలు, మధ్యవర్తుల గుత్తాధిపత్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమస్యపై ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు తక్షణమే దృష్టి సారించి, కోత యంత్రాల చార్జీలను నియంత్రించి, రైతులకు ఉపశమనం కల్పించాలని అన్నదాతలు తీవ్రంగా కోరుతున్నారు.






