ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

by Jakkula.Mamatha |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను ప్రారంభించిందని తెలిపారు. సమస్యల పరిష్కారంతో పాటుగా మన ప్రభుత్వం వచ్చాక మీకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించడం తో పాటుగా అదే సమయంలో ప్రజల అవసరాలను స్థానికంగా తెలుసుకుని త్వరితంగా పరిష్కరించడం ఈ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లక్ష్యం అన్నారు.

మన ప్రజా ప్రభుత్వం వచ్చాక గత రెండున్నర సంవత్సరాలలో పనులు చేయలేదని ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేస్తున్నారు అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ళలో వికారాబాద్ నియోజకవర్గంలో కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు ఉన్నవి రిపేర్ చేయలేదని విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాలలో రూ.600 కోట్లతో రోడ్లు వేయించామని అన్నారు. వాళ్ళ పదేళ్ల పాలనలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ పదేళ్ల పాటు పేదలను మోసం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయి. 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు అన్నారు. ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ హాస్టళ్ల పిల్లలకు 40 శాతం డైట్ చార్జీలు 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ గ్రామాలు కాలనీలలోని ప్రజలకు తెలియజేయాలని గ్రామ సర్పంచ్ లకు మున్సిపల్ కౌన్సిలర్లకు సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ఇందుకు సరైన వేదిక. వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ ప్రభుత్వ సమావేశాలకు హాజరు కావాలి అని తెలిపారు. మన నియోజకవర్గంలో 200 కోట్లతో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ కాలేజీ నిర్మాణం వేగంగా జరుగుతున్నది. ప్రతి మండలంలో ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మర్పల్లి మండల కేంద్రానికి ఒక పబ్లిక్ స్కూల్ మంజూరు అయింది అన్నారు.

ప్రచారం గురించి పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్తున్నాను ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మిగిలిన సమయంలో పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందజేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఎస్పీ స్నేహ మెహ్రా జడ్పీ సీఈవో సుదీర్ వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story