గ్లోబల్ సమ్మిట్‌.. సూపర్‌ సక్సెస్

by Thanuru Gopichand |

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ‘ఫ్యూచర్‌ సిటీ’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’ సూపర్‌ సక్సెస్ అయింది.

గ్లోబల్ సమ్మిట్‌.. సూపర్‌ సక్సెస్
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ‘ఫ్యూచర్‌ సిటీ’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’ సూపర్‌ సక్సెస్ అయింది. 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి సంకల్పానికి ఈ సమ్మిట్‌ బీజం వేసింది. రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు, పరిశ్రమలు ముందుకు వచ్చి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో ‘రైజింగ్‌-2047’ లక్ష్య సాధన దిశగా అడుగులు పడినట్లైంది. ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్దమైందన్న సంకేతాలను సైతం సమ్మిట్‌ ప్రస్ఫుటం చేసింది. సమ్మిట్‌ ముగింపు సందర్భంగా‘తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ -2047’ ఆవిష్కరించారు. ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులు సమ్మిట్‌ లోని అద్భుతాలను తిలకించేందుకు అవకాశం కల్పించారు. బుధవారం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో సందర్శించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

పెట్టుబడుల సునామీ..

2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అంతర్జాతీయ, జాతీయ సంస్థలను ఆకర్షించి పెట్టుబడులకు సాధించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సమ్మిట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపారు. రెండు రోజుల సమ్మిట్‌ లో రికార్డు స్థాయిలో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. పెట్టుబడుల కోసం కంపెనీలను ఆహ్వానించేందుకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్విట్టర్లాండ్‌ లోని దావోస్‌కు వెళ్లటం పరిపాటిగా వస్తోంది. ఇందుకు భిన్నంగా సీఎం రేవంత్‌ రెడ్డి వివిధ దేశాల కంపెనీలను హైదరాబాద్‌ కు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందించి.. పెట్టుబడులు పెట్టేందుకు ‘మేం సిద్దం’ అంటూ ఒప్పందాలు చేసుకున్నారు.

ఆహ్లాదకర వాతావరణంలో సాగిన సమ్మిట్‌..

రెండు రోజుల గ్లోబల్‌ సమ్మిట్‌ ఆహ్లాదకర వాతావరణంలో సాగేలా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమ్మిట్‌ విజయవంతంలో తమవంతు పాత్రను పోషించారు. ముగింపు సందర్భంగా అతిథులను పోచంపల్లి ఇక్కత్‌ శాలువాలతో సత్కరించారు. అలాగే హైదరాబాద్‌ అత్తర్‌ సీసాలు, ముత్యాల ఆభరణాలు, చేర్యాల పెయింటింగ్స్​‍తో కూడిన ‘సావనీర్‌ కిట్‌’ ను అతిథులకు అందజేశారు. హైదరాబాద్‌ బిర్యానీతోపాటు సకినాలు, తీపి అప్పాలు, బదామ్‌ కీ జాలీ, మవా లడ్డూలు వంటి తెలంగాణ రుచులతో నోరూరించే స్వీట్లు, ఇతర వంటకాలను అతిథుల వడ్డించడంతో అతిథులు ఫిదా అయ్యారు. పేరిణి నృత్యం, కొమ్ము కోయ నృత్యం, ఎం.ఎం.కీరవాణి సంగీత కచేరి, వీణా వాద్యం, గుస్సాడీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విజన్‌-2047 లక్ష్యాలను వివరించే థీమ్‌ లతో నిర్వహించిన భారీ డ్రోన్‌ షో ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది.

Next Story