ఘరానా నేరస్థుడి అరెస్ట్

by Jakkula.Mamatha |

దొంగతనంలో ఆరితేరిన ఓ ఘరానా నేరస్థుడిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘరానా  నేరస్థుడి అరెస్ట్
X

దిశ, ఇబ్రహీంపట్నం: దొంగతనంలో ఆరితేరిన ఓ ఘరానా నేరస్థుడిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50కి పైగా ఆస్తి నేరాలకు పాల్పడిన కరుడుగట్టిన నేరస్థుడిని అరెస్ట్ చేయడంతో పోలీసులు ఒక హై-ప్రొఫైల్ "అటెన్షన్ డైవర్షన్" దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల ఏప్రిల్ 19న నిందితుడు పాత సామాన్లు అమ్ముతాననే నెపంతో నాదర్‌గుల్‌లో స్క్రాప్(పాత ఇనుము) వ్యాపారం చేసే కుర్వ పద్మమ్మ వద్దకు వచ్చి, "మెటీరియల్ తనిఖీ చేయాలని" చెప్పి ఆమెను ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె దృష్టి మళ్లించాడు. ఆపై రహస్యంగా ఆమె ఇంటికి చేరుకున్నాడు. అక్కడ, ఆమె చిన్న కుమార్తెను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించి రూ.1లక్ష 40వేల నగదు, 50 తులాల వెండి పట్టీలతో పరారయ్యాడు.

సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక నిఘాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఆదిబట్ల క్రైమ్ టీం నిందితుడిని గుర్తించి శనివారం పోలీసులు హైదరాబాద్, గుడిమల్కాపూర్ లో నివాసం ఉండే నిందితుడు మొహమ్మద్ షాబాజ్ అలియాస్ హైదర్(26)ను అదుపులోకి తీసుకొని అతని నుంచి రూ.50 వేల నగదు, ఒక నలుపు రంగు సుజుకి బర్గ్‌మన్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు 2019 నుంచి వరుస నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అతను ముఖ్యంగా దృష్టి మళ్లించే పద్ధతుల ద్వారా పాత సామాన్ల దుకాణాలు, కిరాణా షాపులను లక్ష్యంగా చేసుకుంటాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇతనిపై సుమారు 53 కేసులు ఉన్నాయని తెలిపారు. మార్చి 2026 లో చర్లపల్లి జైలు నుండి విడుదలైన కొద్ది కాలానికే ఇతడు మళ్లీ ఈ నేరానికి పాల్పడ్డాడు. నేరస్తుడిని ఆదిభట్ల సీఐ రవికుమార్ నేతృత్వంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. నోయల్‌రాజ్, క్రైమ్ టీం సభ్యులు:ఎల్. రవి, ఎల్లయ్య, కిరణ్, ఎండి సంతోష్, సందీప్, శివ, సంతోష్ అరెస్టు చేసినట్లు తెలిపారు.

Next Story