ఇబ్రహీంపట్నంలో గ్యాస్ కలకలం.. డ్రమ్ముల్లో డీజిల్ కొనుగోలు

by Ramesh Naini |

అమెరికా-ఇరాన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇబ్రహీంపట్నంలో గ్యాస్ కలకలం.. డ్రమ్ముల్లో డీజిల్ కొనుగోలు
X

దిశ, ఇబ్రహీంపట్నం : అమెరికా-ఇరాన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉంటున్నారు. కాగా భారత్ గ్యాస్ తమ మొబైల్ ఫోన్‌లో బుకింగ్ కాకపోవడం వలన వినియోగదారులు నేరుగా ఏజెన్సీ కార్యాలయం వద్దకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బందికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వెంటనే భారత్ ఏజెన్సీ సిబ్బంది ఆర్డీవో అనంతరెడ్డి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వినియోగదారులను అదుపులోకి తీసుకొని వచ్చి, క్యూ లైన్ ప్రకారం కూపన్‌లు ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పెట్రోల్ బాంకుల్లో డీజిల్ కొరత కూడా ఏర్పడింది. దీంతో కొంత మంది అవకాశవాదులు డీజిల్ ఉన్న పెట్రోల్ బాంక్‌ల వద్ద డ్రమ్ములలో డీజిల్ తీసుకుంటున్నారు.

ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి

ఎల్పీజీ గ్యాస్, చమురు కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. దీనిపై ఎవరూ ఆందోళన చెందొద్దు.. అని ఆర్డీవో అనంతరెడ్డి స్పష్టం చేశారు. భారత్ గ్యాస్ బుకింగ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మొబైల్‌లో అవ్వడం లేదు. దీంతో వినియోగదారులు ఏజెన్సీ కార్యాలయం వద్దకు ఒక్కసారిగా చేరుకొని ఆందోళనకు గురవుతున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. అలాగే చమురు కొరతపై వస్తున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. డీజిల్ కొరత ఏర్పడిందని, పుకార్లు స్పష్టించి, అవకాశవాదులు సొమ్మును క్యాష్ చేసుకోవాలని వదంతులు సృష్టిస్తున్నారు. వదంతులు ఎవరు నమ్మొద్దు.. పెట్రోల్ బాంకుల్లో డీజిల్‌‌ను వాహనదారులకు తప్ప, మిగతా ఇతర డ్రమ్ములు, బాటిల్లలో డీజిల్‌ను విక్రయాలు చేయవద్దని పెట్రోల్ బాంకు యాజమాన్యాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Next Story