రేపటి భారతదేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

by Disha Web Desk 20 |
రేపటి భారతదేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
X

దిశ, శంషాబాద్ : రేపటి భారతదేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచింతల్ లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో వివిధ కోర్సులలో శిక్షణ పొందిన యువతి యువకులకు సోమవారం సర్టిఫికెట్లు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యం కలిగి ఉన్న యువతరం నవ్యభారతాన్ని సమగ్రంగా నిర్మించగలరన్న అభిలాషతో స్వర్ణభారత్ ట్రస్ట్ యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాము అన్నారు.

శ్రద్ధాసక్తులే మన భవిష్యత్ జీవితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే నేను యువతకు ఒకటే చెబుతాను. ఇష్టపడి కష్టపడితే నష్టపోయేది లేదు. అందుకే శ్రమించండి... శ్రమించండి అనుకున్నది సాధించే వరకూ శ్రమించండి అన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా లభించే సంతృప్తి మరింత ప్రత్యేకమైనదన్నారు. చిత్తశుద్ధితో చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఎవరైనా ఈ సంతృప్తిని పొందగలరన్నారు. రైతులు, మహిళలు, యువత అభివృద్ధి మీద స్వర్ణభారత్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒక్క పూట అన్నం పెట్టడం కాదు, రోజూ అన్నం సంపాదించుకునే స్వశక్తిని పెంపొందించుకునే నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది అన్నారు.

ముఖ్యంగా ఈరోజు టైలరింగ్ శిక్షణను పూర్తి చేసుకున్న మహిళలు సాధికారత మార్గంలో ముందుకు సాగుతారని ఆకాంక్షిస్తున్నాను. మీకున్న ఈ నైపుణ్యం మీ సాధికారత కోసమే. ఇతరుల మీద మీరు ఆధారపడకూడదన్నదే స్వర్ణభారత్ ట్రస్ట్ ఆశయం అన్నారు. మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడగలిగే పరిస్థితి రావాలన్నదే మా ఆకాంక్ష. స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొంది జీవితంలో నిలదొక్కుకున్న ఎంతో మంది తమ కుటుంబానికి చేదోడుగా నిలబడుతున్నామని చెబుతుంటే కలుగుతున్న ఆనందం వెలకట్టలేనిది అన్నారు.

స్వర్ణభారత్ ట్రస్ట్ కు ఎప్పటికప్పుడు సహకారాన్ని అందిస్తున్న మిత్రులకు, మాతో కలిసి ముందుకు సాగుతున్న ఇతర సంస్థలకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ సిబ్బంది, శిక్షణ పొందిన యువతి, యువకులు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed