ఎవరి కోసం ఆ వసూళ్లు ? కలకలం సృష్టించిన ‘దిశ’ కథనం

by Thanuru Gopichand |

రేషన్‌ డీలర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన వైనంపై ‘దిశ’ పత్రికలో వచ్చిన ‘రేషన్‌ కమీషన్‌..ముడుపులు కామన్‌!’ కథనం సివిల్‌ సప్లయ్‌ శాఖలో కలకలం రేపింది.

ఎవరి కోసం ఆ వసూళ్లు ? కలకలం సృష్టించిన ‘దిశ’ కథనం
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రేషన్‌ డీలర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన వైనంపై ‘దిశ’ పత్రికలో వచ్చిన ‘రేషన్‌ కమీషన్‌..ముడుపులు కామన్‌!’ కథనం సివిల్‌ సప్లయ్‌ శాఖలో కలకలం రేపింది. లంచం డబ్బులు తీసుకుంటూ జిల్లా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు ఇటీవల ఏసీబీకి పట్టుబడడం.. ఇదే క్రమంలో కమీషన్‌ పేరిట రేషన్‌ డీలర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి రావడం ఆ శాఖలో హాట్‌ టాపిక్‌ గా మారింది. వరుసబెట్టి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవ.. అవాస్తవాలను తేల్చాల్సింది పోయి.. అక్రమ వసూళ్లు అవాస్తమని కొట్టిపారేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వసూళ్లకు అద్దం పట్టే స్క్రీన్‌ షాట్స్​, ఆడియో రికార్డింగ్‌ లు వాట్సాప్‌ గ్రూపులలో చక్కర్లు కొట్టగా... దీన్ని అధికారులు సైతం టేకిట్‌ ఈజీగా తీసుకుంటుండటం అందరినీ విస్మయపరుస్తోంది. యూపీఐ స్కానర్‌ ఎవరిది ?.. ఆయా రోజుల్లో ఆ అకౌంట్‌ కు ఎంత అమౌంట్‌ జమ అయింది. ఎందుకోసం.. ఎవరి కోసం వసూలు చేశారు?. అన్న విషయాలపై ఇప్పటికైనా క్షుణ్ణంగా విచారణ జరపాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

ఎందుకోసం వసూలు..

రేషన్‌ బియ్యం పంపిణీ చేసినందుకు ప్రతి నెలా జిల్లాలోని రేషన్‌ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పది లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.75 లక్షలు కమీషన్‌ రూపంలో చెల్లిస్తోంది. కమీషన్‌ నేరుగా రేషన్‌ డీలర్ల ఖాతాల్లోనే జమ అవుతుంది. న్యాయంగా ఈ కమీషన్‌ డీలర్లకు రావాల్సిందే. కానీ రేషన్‌ డీలర్ల సంఘం నేతలు కొందరు ఇందులోనూ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అధికారులకు వాటాలు ఇవ్వాలంటూ డీలర్ల నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఐదు నెలల కమీషన్‌ పెండింగ్‌ బిల్లుల విడుదల సందర్భంగా డీలర్ల నుంచి సంఘం నేతలు డబ్బులు వసూలు చేసింది కూడా ఇందుకే. ఏ మీటింగ్‌ కోసమో? ఇతర ఖర్చుల కోసమో! వసూలు చేస్తే అది వేరే విషయం. కానీ.. కేంద్రం నుంచి వచ్చే కమీషన్‌ కోసమే డబ్బుల వసూలు చేస్తున్నట్లు ఆడియో రికార్డింగ్‌ ఉంది. అలాగే వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్స్​ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్రమ వసూళ్లు అవాస్తవమంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి వనజాత శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అయితే స్క్రీన్‌ షాట్స్​, ఆడియో రికార్డింగ్‌ అన్నీ ఉత్తుత్తివేనా!. వసూళ్లు చేసిన డబ్బులు ఎవరెవరికి చేరాయి? అన్న విషయాన్ని పక్కన బెడితే.. సంఘం నేతలు రేషన్‌ డీలర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం తప్పే కదా !. అక్రమ వసూళ్లకు సంబంధించిన ఆధారాలు కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అదంతా ఉట్టిదేనని గుడ్డిగా కొట్టి పారేయడం.. అక్రమాలను భూస్థాపితం చేసే ప్రయత్నమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవాస్తవమని చెప్పినంత మాత్రాన.. తప్పులు ఒప్పు కావన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Next Story