పంచాయతీల ‘స్వయం సమృద్ది’పై ఫోకస్

by Ajay Maddhiboyina |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్దికి గ్రాంట్లను విడుదల చేస్తున్నప్పటికీ నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇకపై నిధుల కోసం పంచాయతీలు ఎదురు చూడకుండా ఆర్థిక పరిపుష్టి సాధించేలా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది.

పంచాయతీల ‘స్వయం సమృద్ది’పై ఫోకస్
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్దికి గ్రాంట్లను విడుదల చేస్తున్నప్పటికీ నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇకపై నిధుల కోసం పంచాయతీలు ఎదురు చూడకుండా ఆర్థిక పరిపుష్టి సాధించేలా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందులో భాగంగా ‘ఆత్మ నిర్భర్‌ పంచాయత్‌’ పథకం కింద స్వయం సమృద్ది సాధించేలా చేయాలని నిర్ణయించింది. ఇందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేయగా అందులో రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యతను కల్పించింది. సంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధికంగా 8 గ్రామ పంచాయతీలకు ప్రాథమిక జాబితాలో చోటు కల్పించారు. ‘ఈ- గ్రామ స్వరాజ్‌’ పోర్టల్‌‌లో నమోదు చేసే వివరాల ఆధారంగా తుది జాబితాలో వీటికి ఆమోదం కల్పించనున్నారు. పంచాయతీలకు ఆదాయం సమకూరే పలు యూనిట్లకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.

రూ.50లక్షల ఆదాయం గల పంచాయతీలకు ప్రాధాన్యత..

‘ఆత్మ నిర్భర్‌’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో రూ.50లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న రంగారెడ్డి జిల్లాలోని 8 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసింది. బిల్డింగ్‌ పర్మిషన్లు, లే అవుట్‌ పర్మిషన్లు, బిల్డింగ్‌ ముటేషన్లు, ట్రేడ్‌ లైసెన్స్‌ల మంజూరు, లైసెన్స్‌‍ల రెన్యువల్‌, ఇంటి పన్ను తదితర రూపేణా ఆయా పంచాయతీలు ఆదాయాన్ని సాధిస్తుండడంతో ప్రాథమిక జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఆయా పంచాయతీలకు ప్రస్తుతం వస్తున్న ఆదాయం ఎంత?. ఆదాయాన్ని పెంచుకునేందుకు స్థానికంగా ఉన్న వనరులు ఏంటీ? తదితర అంశాలతో అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ప్రస్తుత సర్పంచ్‌‌తో పాటు ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి, మాజీ సర్పంచ్ అభిప్రాయాన్ని సైతం తప్పనిసరిగా తీసుకోనున్నారు. గ్రామ సభ నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేశాక వాటితో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ ‘ఈ- గ్రామ స్వరాజ్‌’లో నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

మహిళా సంఘాలకు ఇచ్చే యోచన!..

గ్రామ పంచాయతీలలో ఆదాయ వనరుల పెంపులో భాగంగా అబ్దాల్లాపూర్‌ గ్రామ పంచాయతీలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌, అనాజిపూర్‌‌లో కన్వెన్షన్‌ హాల్‌, ఎల్లికట్ట పంచాయతీలో కూరగాయల సాగుకు సంబంధించి పాలి హౌస్‌‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. మోకీలాలో రెస్టారెంట్‌‌తో పాటు ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌‌ను ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. చాలా వరకు గ్రామ పంచాయతీల్లో ఫంక్షన్‌ హాల్స్ ఏర్పాటు దిశగానే ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు పథకాలను మహిళలకే అప్పగిస్తుండడంతో జిల్లాలో కూడా ఆయా యూనిట్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. తుది జాబితాలో చోటు సంపాదించుకున్న పంచాయతీలకు బ్యాంకులు, నాబార్డు, హడ్కో వంటి సంస్థల ద్వారా రుణ సాయం అందించనుండడంతో ఆయా పంచాయతీలు మరింత ఆర్థికసమృద్దిని సాధించే అవకాశాలు ఉన్నాయి.

ప్రాథమిక జాబితాలో ఎంపికైన పంచాయతీలు ..

మండలం పంచాయతీ పేరు

ఫరూక్‌‌నగర్‌ ఎల్కట్ట

నందిగామ నందిగామ

నందిగామ మేకగూడ

శంకర్‌‌పల్లి మోకిలా

అబ్దుల్లాపూర్‌‌మెట్‌ అబ్దుల్లాపూర్‌

అబ్దుల్లాపూర్‌‌మెట్‌ అనాజీపూర్‌

మహేశ్వరం తుమ్మలూరు

కందుకూరు లేమూర్‌

Next Story