‘గ్రీన్‌ ఫీల్డ్​’ పేరుతో ఇబ్రహీంపట్నంలో ఫామ్‌ ల్యాండ్‌ దందా

by Ajay Maddhiboyina |

రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ‘ముద్ర గ్రీన్‌ ఫీల్డ్​’ కంపెనీ చేస్తున్న ఫామ్‌ ల్యాండ్‌ దందాపై అనేక ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇన్వెస్ట్ మెంట్‌ పర్పస్‌ అంటూ కంపెనీ నిర్వాహకులు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

‘గ్రీన్‌ ఫీల్డ్​’ పేరుతో ఇబ్రహీంపట్నంలో ఫామ్‌ ల్యాండ్‌ దందా
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/ ఇబ్రహీంపట్నం : రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ‘ముద్ర గ్రీన్‌ ఫీల్డ్​’ కంపెనీ చేస్తున్న ఫామ్‌ ల్యాండ్‌ దందాపై అనేక ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇన్వెస్ట్ మెంట్‌ పర్పస్‌ అంటూ కంపెనీ నిర్వాహకులు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. 121 గజాల ప్లాటు కేవలం రూ. 8 లక్షల పైనే! అంటూ అందమైన బ్రోచర్లతో కస్టమర్లను ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నారు. అంతే కాదు..ప్లాట్లలో శ్రీగంధం, ఆస్ట్రేలియన్‌ టేక్‌ చెట్లను పెంచి పదేళ్ల తర్వాత లాభాలను పంచి పెడతామంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తూ..ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా రెండు, మూడు గుంటలకు రిజిస్ట్రేషన్లు చేస్తూ రెవెన్యూ అధికారులు రియల్‌ సంస్థ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

స్పెషల్‌ ఆఫర్లతో మోసం..

ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న నెర్రవల్లి గ్రామ శివారులో ‘ముద్ర గ్రీన్‌ ఫీల్డ్’ కంపెనీ భారీ ఫామ్‌ లాండ్‌ దందాకు తెరలేపింది. స్పెషల్‌ ఆఫర్ల పేరుతో షార్ట్ కట్‌ వ్యాపారం చేసి కస్టమర్లను ముంచే ప్రయత్నం చేస్తున్నదన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. సర్వే నెం.96, 97, 100, 102, 103, 104, 105, 106, 107, 114, 115, 117, 118, 119, 120, 121లలో ఏకంగా 120 ఎకరాల్లో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసి విక్రయాలు మొదలుపెట్టారు. ఆయా ప్లాట్లలో శ్రీగంధం, ఆస్ట్రేలియన్‌ టేకు చెట్లను పెంచుతామని.. డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టం ద్వారా చెట్ల పెంపకం మెయింటనెన్స్​‍ను కంపెనీ చూసుకుంటుందని నమ్మ బలుకుతున్నారు. పది, పదిహేనేళ్ల తర్వాత చెట్ల విక్రయాల ద్వారా వచ్చే లాభాలను ఫిఫ్టీ..ఫిఫ్టీ లెక్కన పంచుతామని ప్లాట్లను కొనుగోలు చేసేలా కస్టమర్లకు ఆశ చూపుతున్నారు.

ఆశపడితే..అంతే సంగతులు..

నాగార్జున సాగర్‌, విజయవాడ హైవేలకు మధ్యలో ఉన్న గ్రీన్‌ ఫీల్డ్​- వెంచర్‌ ప్రాంతానికి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చునని బ్రోచర్లతో పాటు సోషల్‌ మీడియా ద్వారా కంపెనీ నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఔటర్‌ రింగు రోడ్డుకు 12 నిమిషాల్లోనే చేరుకోవచ్చునని, చేరువలోనే రామోజీ ఫిల్మ్ సిటీ, గ్రీన్‌ ఫీల్డ్​ సెజ్‌, ఆక్టోపస్ పోలీస్ క్యాంపులు ఉన్నాయంటూ చెబుతున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇందులో మెంబర్‌ షిప్‌ ఇస్తామని, కాటేజ్‌ లతోపాటు చిల్ట్రన్స్​ ప్లే పార్క్​, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సదుపాయాలు ఉన్నాయని.. కుటుంబంతో ఒక్క రోజు ఇక్కడకు వచ్చి సంతోషంగా గడపవచ్చునంటూ కస్టమర్లు గాలిలోనే మేడలు కట్టేలా చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కస్టమర్లను కార్లలో తరలించి ప్లాట్లు కొనుగోలు చేసేలా మాయ చేస్తున్నారు. వీకెండ్‌ లో కస్టమర్లను వెంచర్‌ వద్దకు తీసుకొచ్చి భోజన సదుపాయం సైతం కల్పించి ప్లాట్లు కొనుగోలు చేసే వరకు వదలడం లేదు. ఈ దందాలో ఏజెంట్లు, దళారులకు భారీగా కమీషన్లు ఇస్తుండటంతో ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం వ్యాపారంలోకి దిగి తోటి ఉద్యోగులు, బంధువులు, స్నేహితులకు అక్రమ ప్లాట్లను అంటగడుతున్నారు. వాస్తవానికి చాలా మంది భవిష్యత్‌ అవసరాల కోసం..పిల్లల ఫ్యూచర్‌ కోసమే ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. ఎప్పుడో పది, పదిహేనేళ్ల వరకు వేచి చూడాల్సి రావడం..ఆతర్వాత ఆ ప్లాట్లను అమ్ముకుందామన్నా! లేకుంటే ఇల్లు కట్టుకోవాలంటే! ముప్పు తిప్పలు పడాల్సి వస్తుందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రోచర్లలో 60, 40 ఫీట్ల రోడ్డును చూపిస్తుండడం.. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంటుండడంతో భవిష్యత్తుల్లో ‘బాట’ సమస్యలు తలెత్తి ప్లాట్‌ ను ఎలా అమ్ముకోవాలో! తెలియక దిక్కుతోచని పరిస్థితి వస్తుందని పలువురు సూచిస్తున్నారు.

అక్రమ దందాకు ‘అధికారుల’ అండ?..

ఎక్కడైనా చిన్న ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ చేయమంటే సామాన్యులకు చుక్కలు చూపించే అధికారులు రియల్‌ వ్యాపారులకు మాత్రం సునాయసంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..20 గుంటలు ఉంటేనే.. దాన్ని వ్యవసాయ భూమిగా పరిగణించాలి. అలాగే ఫార్మ్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు సైతం ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ నిబంధనలకు విరుద్దంగా తహసీల్దార్‌ కార్యాలయాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం గమనార్హం. ‘ముద్ర గ్రీన్‌ ఫీల్డ్​’ వెంచర్‌ లో ఒక గుంట దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఐదారు గుంటల వరకు గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారంతో ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు సైతం ఆదాయ పరంగా గండి పడుతోంది. రియల్టర్లు డెవలప్‌ మెంట్‌ ఛార్జీల నిమిత్తం ఎకరానికి చెల్లించాల్సిన డబ్బులే కాకుండా.. గ్రామ పంచాయతీకి 10 శాతం స్థిరాస్తి భూమిని గిఫ్ట్ చేయకుండా ఎగవేస్తున్నారు. రియల్టర్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులు ఈ దందాను అడ్డుకోవాల్సింది పోయి..ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడేపడే విషయంలో తమవంతు పాత్ర పోషిస్తుండడం విస్మయం గొలుపుతోంది.

Next Story