- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎండలు బాబోయ్ ఎండలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
సూర్యుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి.

దిశ, తాండూరు: సూర్యుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. గత రెండు రోజుల నుంచి జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదు కాగా కనిష్ఠం 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు, మూగ జీవాలు ఎండ వేడిమి తాళలేక దాహార్తితో తల్లడిల్లిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో భగ్గుమంటున్న భానుడు తాపాన్ని తట్టుకునేందుకు టోపీలు, గొడుగులు, కండువాలు తలపై వేసుకుని బయటకు వస్తున్నారు.
ఎండా... ఠండా..
సూర్యుని సీజన్‌లో నిప్పులా వీస్తున్న వేడికి జనం ‘ఠండా’ మంత్రం జపిస్తున్నారు. చల్లని పదార్థాలు వైపు మొగ్గు చూపుతున్నారు. పుచ్చకాయ, కీరదోస, తాటి ముంజల వంటి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. చెరుకు, పుదీనా, నిమ్మరసం, మజ్జిగ, లస్సీ, పలు చల్లటి పండ్ల రసాలతో పాటు కొబ్బరి బోండాలు సేవిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు చల్లటి పానీయాల దుకాణాలు వెలిశాయి. పాదాచారుల దాహార్తి తీర్చేందుకు పట్టణంలోని ప్రతి చోట చలివేంద్రాలు వెలిశాయి. మండుటెండల్లో పలువురు ఈతలు పడడం కనిపిస్తున్నది.
అప్రమత్తంగా ఉండాలి..
మండుతున్న ఎండలకు ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమం అనుకుంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదంటున్నారు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, లేదా నెత్తిన తెల్లటి బట్ట వేసుకొని వెళ్లాలని, నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. కనుక ఎక్కువ నీరు తాగాలని సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా పెరుగు, మజ్జిగ, నిమ్మ రసం తాగాలని, వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు. గర్భిణీలు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలని. వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, వాంతులు, అలసట, తలనొప్పి, కండరాల్లో తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదన్నారు.






