బ్యాంక్‌లోనే రూ.50వేలు ఎత్తుకెళ్లిన మహిళ.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

by Jakkula.Mamatha |

బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చిన మహిళ నుంచి కౌంటర్ వద్దనే గుర్తు తెలియని మహిళ రూ.50 వేలు చోరీ చేసిన సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా బ్యాంకులో చోటు చేసుకుంది.

బ్యాంక్‌లోనే రూ.50వేలు ఎత్తుకెళ్లిన మహిళ.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
X

దిశ, చేవెళ్ల: బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చిన మహిళ నుంచి కౌంటర్ వద్దనే గుర్తు తెలియని మహిళ రూ.50 వేలు చోరీ చేసిన సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా బ్యాంకులో చోటు చేసుకుంది. భాదితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చన్వెళ్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల సుధాకర్ రెడ్డి తన భార్య స్వప్న పేరు మీద రూ. 2.50 లక్షల బంగారం రుణం కెనరా బ్యాంకులో తీసుకున్నారు. అయితే తీసుకున్న రుణం రినివల్ చేసేందుకు శుక్రవారం భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉదయం కెనరా బ్యాంకుకు వచ్చి రుణం చెల్లించేందుకు భార్య స్వప్న బ్యాంక్ క్యూలైన్ లో నిలబడింది.

కాగా, కౌంటర్ వద్ద గుర్తు తెలియని మరో మహిళ రూ.50 వేల రూపాయల కట్టను చోరి చేసింది. ఇది గమనించకుండా స్వప్న క్యాష్ కౌంటర్ లోకి నగదు ఉన్న కవర్ ఇవ్వగా రూ.50 వేలు తక్కువగా ఉన్నాయని క్యాషియర్ చెప్పడంతో స్వప్న కంగుతిన్నది. 2.50 లక్షల్లో రూ.50 వేలు తక్కువగా ఉన్నాయి. దీంతో బాధితురాలు తన వద్ద డబ్బులు ఎవరో తీసుకున్నారని బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించమని కోరింది. అయితే సీసీ కెమెరాలు ఇప్పుడు చూడలేమని సమయం పడుతుందని మేనేజర్ సమాధానం ఇచ్చారు.

రెండు గంటల తర్వాత వారికి తెలిసిన వ్యక్తి ద్వారా మేనేజర్‌ను ప్రశ్నిస్తే అప్పుడు మేనేజర్ సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. కౌంటర్ వద్ద క్యూలో ఉండగా పక్కనే ఉన్న మరో గుర్తు తెలియని మహిళ స్వప్న కవర్ నుంచి రూ.50 వేలు చోరీ చేసినట్లు సీనీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ కెమెరాలను మేనేజర్ వెంటనే పరిశీలించకపోవడంతోనే డబ్బులు చోరీకి పాల్పడిన మహిళ అక్కడి నుంచి తప్పించుకు పోయింది. భాదితురాలు బోరుమని విలపించింది. బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు డబ్బులు చోరీకి పాల్పడిన మహిళను పట్టుకొని తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో శనివారం ఉదయం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Next Story