- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీల్లో పెరిగిన బీసీల ‘బలగం’
దిశ, రంగారెడ్డి బ్యూరో : ఇటీవల రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో : ఇటీవల రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. మెజార్టీ సర్పంచి పదవులను బీసీ వర్గాలే గెలిచి పై చేయి సాధించారు. రంగారెడ్డి జిల్లాలో 525 పంచాయతీలకు ఎన్నికలు జరగగా బీసీలు 197 మంది సర్పంచు పీఠంపై కొలువుదీరారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 594 పంచాయతీలకు 233 మంది సర్పంచులుగా విజయ కేతనం ఎగుర వేశారు. రిజర్వ్ డు స్థానాల్లోనే కాదు.. జనరల్ స్థానాల్లో పోటీ చేసి బీసీ అభ్యర్థులు సత్తా చాటారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో పంచాయతీల్లో బీసీల బలగం పెరగడం శుభ పరిణామమని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజకీయ చైతన్యానికి ప్రతీక..
జనరల్ సీట్ అంటే అగ్ర కులాలకు మాత్రమే అన్నట్లుగా అన్ని రాజకీయ పార్టీలు ఇన్నాళ్లుగా భావిస్తూ వచ్చాయి. ఇదే భావన బీసీల్లోనూ పాతుకు పోయింది. డబ్బు, మద్యం, కండ బలం, బంధు బలం..ఇలా అన్ని అస్త్రాలతో జనరల్ స్థానాల్లో అగ్రకుల అభ్యర్థులే నిలబడుతూ వస్తున్నారు. జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేయాలనుకున్నా రాజకీయ పార్టీలు టిక్కెట్ ఇవ్వక పోవడం, ఇచ్చినా పార్టీ మద్దతు లేకుండా చేయడం, రెబల్ గా బీసీయేతర కులాల అభ్యర్థులను నిలపడం సర్వ సాధారణంగా ఉంటూ వస్తోంది. ఓసీలు రిజర్వ్ సీట్లలో పోటీ చేయలేరు కాబట్టి మీరు కూడా జనరల్ సీట్లకు రాకూడదనే వక్ర బుద్దితో బీసీలను పోటీకి దూరంగా ఉంచారు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ బీసీలు పల్లకీ మోతకే పరిమితమై ఇతర పార్టీల నేతలను గెలిపిస్తూ వస్తున్నారు. కానీ.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీసీలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై ఉద్యమాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పంచాయతీ ఫలితాలు బీసీ వర్గాలకు కొండంత బలాన్ని ఇచ్చాయి. ఇది బీసీల రాజకీయ చైతన్యానికి ప్రతీకగా బీసీ వర్గాలు చెప్పుకుంటున్నారు.
రెండింతలకు పెరిగిన బీసీల బలం..
రిజర్వ్ డు స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ పోటీచేసేందుకు సాహసం చేసి బీసీ అభ్యర్థులు సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లాలో 525 సర్పంచు స్థానాలకు గాను ఎస్టీకి 90 స్థానాలు, ఎస్సీకి 106, బీసీకి 92, జనరల్‌కు 237 స్థానాలను కేటాయించారు. మొత్తంగా 247 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే జనరల్ స్థానాల్లో పోటీచేసి అదనంగా 105 మంది సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. దీంతో జిల్లాలో బీసీల ప్రాతినిధ్యం 197 (37.52శాతం)కు పెరిగింది. అలాగే.. వికారాబాద్ జిల్లాలో 594 పంచాయతీలకు ఎస్టీలకు 119, ఎస్సీలకు 111, బీసీలకు 107, జనరల్ కు 257 స్థానాలను కేటాయించారు. రిజర్వ్ చేసిన 107 స్థానాలతో పాటు 126 జనరల్ స్థానాల్లోనూ గెలుపొంది మొత్తంగా 233(39.23 శాతం) బీసీలు సర్పంచు పీఠాలపై కూర్చున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం కూడా పెరిగింది.
రంగారెడ్డి జిల్లా వివిధ వర్గాల గెలుపు ఇలా..
కేటగిరీ ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ మొత్తం శాతం
ఎస్టీ 90 0 0 0 90 17.14
ఎస్సీ 0 106 0 0 106 20.19
బీసీ 0 0 92 0 92 17.52
ఇతరులు 30 08 105 94 237 45.14
మొత్తం 120 114 197 94 525 100
శాతం 22.86 21.71 37.52 17.9 100 100
వికారాబాద్ జిల్లాలో వివిధ వర్గాల గెలుపు ఇలా..
కేటగిరీ ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ మొత్తం శాతం
ఎస్టీ 119 0 0 0 119 20.03
ఎస్సీ 0 111 0 0 111 18.69
బీసీ 0 0 107 0 107 18.01
ఇతరులు 17 08 126 126 106 43.27
మొత్తం 136 119 233 106 594 100
శాతం 22.9 20.03 39.23 17.85 100 100






