అధికార పార్టీ అండ.. అధికారుల దండ: యథేచ్ఛగా భూ దందా

by Naga Rani Yarlagadda |

అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ వెంచర్లు వెలుస్తున్నా అధికారులు మాత్రం చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు.

అధికార పార్టీ అండ.. అధికారుల దండ: యథేచ్ఛగా భూ దందా
X

దిశ, మీర్‌పేట్ : బడంగ్ పేట్ సర్కిల్ బాలాపూర్ లో నిబంధనలకు విరుద్ధంగా, మున్సిపల్ అనుమతులు లేకుండా అడ్డగోలుగా వెంచర్లు వెలుస్తున్నాయి. కొంత మంది అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ వెంచర్లు వెలుస్తున్నా అధికారులు మాత్రం చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. బడంగ్ పేట్ సర్కిల్ బాలాపూర్ డివిజన్ పరిధిలోని 9, 10 ,11 సర్వే నంబర్ లో 2 ఎకరాల 20 గుంటల భూమిలో ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా కొంత మంది నాయకులు అక్రమ వెంచర్ కు తెరలేపారు. `వెంచర్ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

2013లో బాలాపూర్ గ్రామపంచాయతీ పాలన పూర్తయినా, నేటికీ జీహెచ్ఎంసీలో విలీనమైనా గ్రామపంచాయతీ అనుమతితోనే అక్రమ వెంచర్లు నడుస్తున్నాయి. అయినా అధికారులు చోద్యం చూడడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి అని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా లే అవుట్ కు అనుమతి ఇచ్చే అధికారం సర్పంచ్ కు ఉండేది కాదు. అయినా అక్రమ వెంచర్ల పరంపర కొనసాగుతున్నది.

అధికార పార్టీ నేతల అండదండలు..

అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది అధికార పార్టీ నాయకుల అడ్డగోలు అక్రమ వెంచర్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బడంగ్ పేట్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై గత నెలలో అధికారులు బలి కావడానికి కూడా అధికార పార్టీ నాయకులే కారణమని బడంగ్ పేట్ సర్కిల్ లో పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. అయినా సదురు నాయకుల వ్యవహార శైలిలో మార్పు రాకపోవడం చర్చనీయాంశమైంది. అధికారులు సస్పెండ్ అయినా ఉన్న అధికారులను కూడా పనిచేయకుండా అడ్డుపడి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మున్సిపల్ ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లతో పాటు పలు పనులు చేపట్టారు. గ్రామపంచాయతీ అనుమతితో నిర్మాణాలు చేపట్టాలన్నా, వెంచర్లు ఏర్పాటు చేయాలన్నా రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరి. అలా కాకుండా అక్రమ వెంచర్ చుట్టూ నాలా కన్వెన్షన్ కు చేసుకోలేదు. డీటీడీసీ అనుమతులు కూడా లేకుండా పనులు కొనసాగిస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

పడని అడ్డుకట్ట..

బడంగ్ పేట్ సర్కిల్ లో స్థానికంగా అనేకచోట్ల గ్రామపంచాయతీ అనుమతితోనే వెంచర్లు వెలుస్తున్నాయి. గతనెల ఏసీబీ విజిలెన్స్ అధికారులు సర్కిల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకొని వెళ్లిన కొన్ని రోజులకే అధికారులపై వేటు వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయినా అక్రమాలకు ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. ఈ అక్రమాల వెనుక ఉన్న బడా నేతలపైన చర్యలు తీసుకోకపోతే అవినీతి అక్రమాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై పలు ఆరోపణలు వస్తున్నా అధికారులు మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న అధికారులు మాత్రం తమకేం తెలియదనేలా వ్యవహరిస్తున్న తీరు మాత్రం అనుమానాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది.

కుల సంఘాలు ఫిర్యాదు..

బాలాపూర్ లో అక్రమంగా జరుగుతున్న వెంచర్ పై కొంతమంది కుల సంఘాల నాయకులు కలెక్టర్, బడంగ్ పేట్ డిప్యూటీ సర్కిల్ కమిషనర్ తో పాటు తహశీల్దార్ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తో పాటు జోనల్ కమిషనర్ చంద్రకళ కలగజేసుకొని అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు అండగా నిలుస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story