- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amangal Municipality: మున్సిపల్ ఎన్నికలా..? ప్రత్యేక పాలనా..?
జనవరి 26న ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం గడుపు పూర్తికానుంది.

దిశ, ఆమనగల్లు: జనవరి 26న ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం గడుపు పూర్తికానుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతుందా? లేదా ప్రత్యేక అధికారుల పాలనవైపు వెళ్తుందా? అని మున్సిపల్‌లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతున్నది. ప్రత్యేకాధికారుల పాలన నిర్వహించడం కన్నా ఎన్నికలు నిర్వహించడం మేలని మున్సిపాలిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలకు సై అంటున్న ప్రధాన పార్టీలు..
ఆమనగల్ మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 13 మంది గెలుపొంది రికార్డు స్థాయిలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. ప్రస్తుతం పాలకవర్గం గడువు ముగుస్తుండడంతో వచ్చే మున్సిపల్ ఎన్నికలపై మూడు ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తగిన వ్యూహంతో అభ్యర్థులను పూర్తిగా మార్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా ఈసారి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజా పోరుబాట మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి వారే తమ వర్గాలతో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లని కాంగ్రెస్ నాయకులు..
పది సంవత్సరాల అనంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భారీగా నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు విఫలమవుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతున్నది.
కేసీఆర్ పాలననే నమ్ముకున్న బీఆర్ఎస్..
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సైతం మున్సిపాలిటీ నాయకులను పట్టించుకోవడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో బలమైన క్యాడర్ కలిగిన బీఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధిష్టానం ప్రత్యేక దృష్టి సాధించాలని బీఆర్ఎస్ నాయకులు చర్చిస్తున్నారు.
కమలం మళ్లీ వికసించేలా..
మున్సిపాలిటీలో కమలాన్ని మళ్లీ వికసింపజేసేలా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజి ఆచారిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మున్సిపాలిటీలో ఇతర పార్టీలకన్నా బలమైన క్యాడర్ బీజేపీకి ఉంది. మరోసారి 15వ వార్డుల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేలా అభ్యర్థులను నియమించి మరోసారి జెండా ఎగరవేస్తామని బీజేపీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చైర్మన్ పీఠం దక్కకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తారో మున్సిపల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






