- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి జిల్లాపై ACB స్పెషల్ ఫోకస్..! మరి నెక్ట్స్ టార్గెట్ ఎవరు..?
రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు వరుసబెట్టి అవినీతి నిరోధక శాఖ (ACB)కి పట్టుబడుతున్నారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు వరుసబెట్టి అవినీతి నిరోధక శాఖ (ACB)కి పట్టుబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఏసీబీ సైతం జిల్లాలోని అవినీతి అధికారులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బాధితులు నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయడం.. సంబంధిత అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం చకచక జరిగిపోతున్నాయి. ఏసీబీ దూకుడుతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో! అనే ఆందోళనతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. నిత్యం నీతి పాఠాలు వల్లెవేసే అధికారులే అనూహ్యంగా ఏసీబీకి పట్టుబడుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్ట్స్ ఏడీ శ్రీనివాస్ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అయితే తమపై కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏసీబీ దాడులు తప్పవన్న భావనలో పలువురు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ తదుపరి టార్గెట్ ఎవరు? అన్న దానిపై జిల్లాలోని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అంతా మామూళ్లమయం..
ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం. అంతా మామూళ్లమయం..అన్నట్లుగా ఉంది ప్రభుత్వ శాఖల తీరు. అయితే ప్రతి శాఖలోనూ అవినీతి అధికారులు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్నారు. అది కూడా డబ్బులు ఇవ్వలేక విసిగిపోయిన వారు మాత్రమే ఏసీబీని సంప్రదిస్తుండటంతోనే వారినే అధికారులు పట్టుకుంటున్నారు. కానీ..క్షేత్రస్థాయిలో నిత్యం వందలాది మంది ప్రతి పనికీ ఉద్యోగులు అడిగినంత చేతిలో పెట్టేసి కావాల్సిన పనిని చక్కబెట్టుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా తమ పని పూర్తయితే చాలనే తీరున వ్యవహరిస్తున్నారు. దీంతో దొరకకుండా తప్పించుకునే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. కంచే చేను మేసిన చందంగా కింది స్థాయి మొదలుకుని పై స్థాయి అధికారుల వరకూ అందరూ లంచాలకు అలవాటుపడిపోతున్నారు. దీంతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి బాధితుల్లో నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాదిలోనే వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖలకు చెందిన వారే ఎక్కువగా పట్టుబడ్డారు.
పట్టుబడుతున్నా.. మార్పు రావట్లే
ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నప్పటికీ ఉద్యోగుల తీరులో మార్పు రాకపోగా.. ఇంకా బరితెగిస్తుండడం గమనార్హం. రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవలి కాలంలో ఏసీబీ కేసులు, సస్పెన్షన్లు వరుసగా చోటుచేసుకుంటుండడమే ఇందుకు ఉదాహరణ. లంచం తీసుకుంటుండగా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్ గత నెలలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈయన స్థానంలో సీనియర్ శివ శంకర్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ రెవెన్యూ పరిధిలోని పార్కు స్థలానికి అక్రమ రిజిస్రేషన్ చేయడంతో స్థానికులు రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు శివ శంకర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. దీనికి ఒక్క రోజు అటు ఇటుగా సరూర్ నగర్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. లంచం తీసుకున్న ఆరోపణలపై హై కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు.. సరూర్ నగర్ రిజిస్ట్రార్ శ్రీలతపై సస్పెన్షన్ వేటు వేశారు. గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితమే ఏసీబీ సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తోంది. ఆరు నెలల క్రితం తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 220 ప్లాట్లను నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్ చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడింది. ఇందుకు బాధ్యుడైన ఇంఛార్జ్ రిజిస్ట్రార్ ఫసియోద్దిన్‌తో పాటు పాటు మరో ఉద్యోగిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగా..ఇదే కార్యాలయంలో ఇంఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయి కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ శాఖలోని మరికొందరిపైననూ ఏసీబీకీ ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది.
రూ.లక్షల్లో జీతాలు వస్తున్నప్పటికీ..
చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం. కాలు మీద కాలు వేసుకుని కూర్చొని హాయిగా బతకొచ్చు. అయినా కొంతమంది లంచాలకు ఆశపడి..టేబుల్ కింద చేతులు పెడుతున్నారు. కార్యాలయంలో దస్త్రం కదలాలన్నా.. ఏ చిన్న అనుమతికైనా..ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి అక్కడక్కడా కనిపిస్తోంది. ఇంత ఇస్తేనే పని చేస్తామనే పంథా కొందరు ఉద్యోగుల నుంచి వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చివరకు ఏసీబీకీ చిక్కి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. కొందరు ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉండి కూడా అవినీతికి పాల్పడి ఉద్యోగాలు కోల్పోతున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన భూపాల్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పదవీ విరమణకు ఆరు నెలల ముందు ఆయన పట్టుబడ్డారు. అలాగే అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ సైతం మరో ఏడాదిలో పదవీ విరమణ పొందనున్నట్లు తెలిసింది. అవినీతి మూలంగా రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రశాంత జీవనం గడిపే పరిస్థితి చాలామందికి ఉండటం లేదు.






