20 ఫీట్ల రోడ్డు.. 37 అంతస్తులు! కిస్మత్పూర్‌లో ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తతంగం

by Vemula.Srinu Prasad |

అది 20 ఫీట్ల రహదారి. వాహనాల రాకపోకలకు ప్రతిరోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్ల రహదారి అంటూ పేర్కొని దానిని అనుమతుల కోసం చూపించి దర్జాగా 37 అంతస్తులకు పర్మిషన్ తీసుకున్నారు. నిర్మాణం ప్రారంభమై సంవత్సరాలు గడుస్తోంది. ఇరుకు రోడ్డు.. నిర్మాణదారుల నిర్లక్ష్యం.. వెరసి ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి.

20 ఫీట్ల రోడ్డు.. 37 అంతస్తులు! కిస్మత్పూర్‌లో ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తతంగం
X

దిశ, గండిపేట : అది 20 ఫీట్ల రహదారి. వాహనాల రాకపోకలకు ప్రతిరోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్ల రహదారి అంటూ పేర్కొని దానిని అనుమతుల కోసం చూపించి దర్జాగా 37 అంతస్తులకు పర్మిషన్ తీసుకున్నారు. నిర్మాణం ప్రారంభమై సంవత్సరాలు గడుస్తోంది. ఇరుకు రోడ్డు.. నిర్మాణదారుల నిర్లక్ష్యం.. వెరసి ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. ఈ వ్యవహారం అంతా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్పూర్‌లో కొనసాగుతోంది. కిస్మత్పూర్ విలేజ్ నుంచి ఎక్సైజ్ అకాడమీ (పోలీస్ అకాడమీ) వెళ్లే దారిలో కుడివైపున బొల్లినేని శంగ్రిల్లా అబ్బం గ్రూప్ 5.7 ఎకరాల విస్తీర్ణంలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మిస్తోంది. ఇందులో 37 అంతస్తుల చొప్పున టవర్స్ నిర్మిస్తున్నారని తెలిసింది. ఇదంతా బాగానే ఉన్నా ఈ నిర్మాణానికి ముందు ప్రస్తుతం 20 ఫీట్ల రహదారి మాత్రమే ఉండటం గమనార్హం. ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పూర్వపు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఈ ఇరుకు రహదారితో ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు అబ్బం కన్‌స్ట్రక్షన్ చేపడుతున్న అతి భారీ నిర్మాణం కోసం ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు సంబంధిత గేటెడ్ కమ్యూనిటీ‌లోకి రాకపోకలు సాగిస్తుంటాయని, తద్వారా ఇక్కట్లకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు.

ప్రమాదాలకు కేరాఫ్..

అడ్డగోలుగా నిర్మాణం చేపడుతున్న అబ్బం కన్స్ట్రక్షన్ ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అడిగే నాథుడు కరువయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇక్కడ నిర్మాణంలో భాగంగా పలువురు కార్మికులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడినట్లు సానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్బం కన్స్ట్రక్షన్‌లో పనిచేస్తున్న కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం, అదేవిధంగా నిర్మాణ సంస్థ వెనుకాల బడాబాబుల నేపథ్యం ఉండడంతో సెటిల్మెంట్లు చేసి ఎంతో కొంత మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా ప్రమాదం..

అబ్బం కన్స్ట్రక్షన్ చేపట్టిన భారీ నిర్మాణం వద్ద ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని తెలిసింది. తాజాగా ఓ వ్యక్తి తలపై అబ్బం కన్స్ట్రక్షన్ పైనుంచి నిర్మాణ వ్యర్థాలు పడిపోవడంతో అతడు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికంగా ఓం నగర్‌లో నివసించే అతడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో విషయం బయటకు పొక్కలేదని విశ్వసనీయ సమాచారం. అతడికి ఎంతో కొంత పరిహారం ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకున్నట్లు తెలుస్తుంది. తరచూ ప్రమాదాలకు కేంద్రబిందువైన అబ్బం కన్స్ట్రక్షన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story