లిస్టులో పేరు కోసం లక్షల డీల్? తాండూరులో డబుల్ ఇళ్ల కేటాయింపు వివాదం

by Ramesh Naini |

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు డబ్బులు ఇస్తే పక్కా మీ పేరును లిస్టులో చేరుస్తామని పైసా వసూల్ ప్రారంభించారని ఆరోపణలు వచ్చాయి. ముందు 50 శాతం డబ్బులు ఇచ్చి.. ఇల్లు మంజూరైన తర్వాత మిగితా డబ్బులు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

లిస్టులో పేరు కోసం లక్షల డీల్? తాండూరులో డబుల్ ఇళ్ల కేటాయింపు వివాదం
X

అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో.. కాంగ్రెస్ ఆయా వార్డుల ఇన్చార్జిలకు నిజమైన పేదలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వసూళ్ల పర్వం మొదలుపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులుగా ఎంపిక చేయాలంటే రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, తాండూరు : ప్రతి కాలనీ నుంచి అనేకమంది ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అందులోంచి నిజమైన పేదలను ఎన్నుకొని వార్డుకు 10 నుంచి 15 చొప్పున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు డబ్బులు ఇస్తే పక్కా మీ పేరును లిస్టులో చేరుస్తామని పైసా వసూల్ ప్రారంభించారని ఆరోపణలు వచ్చాయి. ముందు 50 శాతం డబ్బులు ఇచ్చి.. ఇల్లు మంజూరైన తర్వాత మిగితా డబ్బులు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. తప్పని పరిస్థితుల్లో ఇల్లు లేని పేదలు అప్పుచేసి నేతలకు రూ.50 వేల నుంచి లక్ష నగదును అందజేస్తున్నట్లు తెలిసింది. దీంతో తాండూరులో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమైన నిరుపేదలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారా? లేదా? స్థానిక కౌన్సిలర్ వెంట తిరిగారా? లేదా? అని తెలుసుకొని మరికొందరు అర్హులైన లబ్ధిదారులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కూడా జరుగుతున్నాయని విమర్శలు తాండూరు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు సంబంధిత శాఖ అధికారులు ఈ విషయంలో ప్రత్యేక ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన లబ్ధిదారులకు డబ్బులు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

581 యూనిట్ల నిర్మాణం..

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు ఖాంజాపూర్ గేట్ సమీపంలో 1050 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో ప్రస్తుతం 581 ఇల్లు నిర్మాణం పూర్తయినట్లు సమాచారం. రూ.1.5 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, మంచినీటి సౌకర్యంతో పాటు పలు పనులు చేపట్టారు. 581 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు 9436 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వార్డుకు 10 నుంచి 15 చొప్పున లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడే కొందరు నేతలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story