ఎయిర్‌పోర్ట్‌లో 5.8 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

by Kodari Anjali |

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు 5.8 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో 5.8 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత
X

దిశ, శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు 5.8 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద మాదకద్రవ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. మే 2న తెల్లవారుజామున 01:10 గంటలకు ఏకే-69 విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మోహన్ కందన్ అనే ప్రయాణికుడి తీరుపై అనుమానం రావడంతో అరైవల్ విలేజ్ ప్రాంతంలో అతడిని అడ్డుకున్నారు. అనంతరం అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సిగరెట్ బాక్సుల్లో చాకచక్యంగా దాచిపెట్టిన 5.8 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. ఈ వ్యవహారంలో తమిళనాడు రాష్ట్రంలోని తోండి ప్రాంతానికి చెందిన సిథిక్ అలీ అనే రిసీవర్ పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ అనంతరం గంజాయితో పాటు వినియోగించిన సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ తదుపరి విచారణ నిమిత్తం బషీర్‌బాగ్‌లోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో విదేశీ మార్గాల ద్వారా హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ నిఘా మరింత పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story