- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్కువ బడ్జెట్‌లోనే 3D ప్రింటెడ్ ఇండ్లు.. 45 రోజుల్లోనే సొంతింటి కల సాకారం..!
సాధారణ ఇంటితో పోలిస్తే త్రీడీ ఇంటికి సగం సిమెంట్ మాత్రమే పడుతుంది. భారీ యంత్రం సాయంతో బ్లాక్ లను ప్రింట్ చేస్తారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో : నిన్న మొన్నటి వరకు భవన నిర్మాణమంటే ఇనుము, ఇసుక, కంకర, సిమెంట్‌తో పిల్లర్స్, బీమ్స్, కాలమ్స్, స్లాబ్ వంటి నిర్మాణాలను చేపట్టేవారు. ఇందులో కాంక్రీట్ వాడకం అధికంగా ఉండేది. క్యూరింగ్ ఇతరత్రా కారణాలతో ఒక అంతస్తు పూర్తయ్యేసరికి సంవత్సర కాలం పట్టేది. కాలం మారింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు నెలల వ్యవధిలోనే భవనాలు పూర్తవుతున్నాయి. మారుతున్న టెక్నాలజీతో ట్రెండ్ మరింతగా మారింది. నేడు సరికొత్త ‘త్రీడీ’ ప్రింటింగ్ ఇండ్ల యుగం నడుస్తోంది. సాంకేతికతను ఉపయోగించి కేవలం 45 రోజుల వ్యవధిలోనే అందమైన భవనాలను నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లోనే లగ్జరీ లాంటి సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా ఉండనున్నది. త్రీడీ ప్రింటెడ్ ఇండ్లు రానున్న రోజుల్లో నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పిల్లర్ల అవసరమే లేదు
త్రీడీ ప్రింటింగ్ ఇండ్ల నిర్మాణంలో కంకర అసలే వాడరు. పిల్లర్ల అవసరం కూడా లేదు. ఇంటి నిర్మాణానికి గోడల(బ్లాక్ లు)లనే వినియోగిస్తారు. పూర్తిగా ప్లేయాష్, సిమెంట్‌తో నిర్మిస్తారు. కొంత మోతాదులో ఇసుక అవసరం పడుతుంది. సాధారణ ఇంటితో పోలిస్తే త్రీడీ ఇంటికి సగం సిమెంట్ మాత్రమే పడుతుంది. బేస్ మెంట్ నుంచి స్లాబ్ వరకు పది అడుగుల ఎత్తులో గోడను నిర్మించాలనుకుంటే మూడు అడుగుల చొప్పున మూడు బ్లాక్ లను, ఒక అడుగు బ్లాక్‌ను రూపొందిస్తారు. భారీ యంత్రం సాయంతో బ్లాక్ లను ప్రింట్ చేస్తారు. ఇందుకు ఐదారు రోజుల సమయం పడుతుంది. ఇలా తయారు చేసిన బ్లాక్ లను నిర్మాణ ప్రాంతానికి తరలించి బేస్ మెంట్ పై అమర్చుతారు. ఒక బ్లాక్‌పై మరో బ్లాక్ ను ఉంచి ‘మర్ ఫర్’ అనే పదార్థంతో ఒకదానికొకటి గట్టిగా అతుక్కునేలా చూస్తారు. ఆ తర్వాత స్లాబ్‌ను వేయడంతో త్రీడీ ప్రింటింగ్ ఇల్లు పూర్తవుతుంది. స్లాబ్ కు మాత్రం ఇనుము, ఉక్కును వాడతారు. ఒక అంతస్తు నిర్మించుకునేవారు స్లాబ్ ను పెంకుటిల్లులా నిర్మించుకోవచ్చు. లేదంటే ఒకేసారి మూడంతస్తులలో త్రీడీ ఇండ్లను నిర్మించుకోవచ్చు. పిల్లర్లు లేకున్నా ఇంటి నిర్మాణం గట్టిగానే ఉంటుంది. 600 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు త్రీడీ ప్రింటింగ్ ఇండ్లను కట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.
తక్కువ బడ్జెట్‌లోనే లగ్జరీ ఇల్లు
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కూలీల కొరత, పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో నేటికాలంలో ఇల్లు కట్టుకోవడం అంటే గగనమే అవుతోంది. చిన్నపాటి ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా..ఎంతలేదన్నా? రూ.10 లక్షలు కావాల్సిందే. అది కూడా అనుకున్న సమయానికి పూర్తవుతుందో..? లేదో ? అన్న ఆందోళన. అయితే త్రీడీ ప్రింటింగ్ ఇండ్లు అందుబాటులోకి వచ్చాక ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం రూ.2 లక్షల బడ్జెట్‌తో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ లాంటి ఇల్లును నిర్మించుకోవచ్చు. హాల్, సింగిల్ బెడ్ రూం, కిచెన్, బాత్రూం వంటి సదుపాయాలతో కేవలం 45 రోజుల వ్యవధిలోనే అందమైన ఇల్లు ముస్తాబవుతుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సొంతింటిని సాకారం చేసుకుంటున్న లబ్దిదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఇండ్లను అందించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో త్రీడీ ప్రింటింగ్ ఇండ్లను అందుబాటులోకి తేగా..తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రజానీకానికి సైతం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ డిజైన్లలో త్రీడ్రీ ప్రింటింగ్ ఇండ్లకు రూపకల్పన చేస్తున్నారు. ఏండ్ల తరబడిగా చెక్కుచెదరని త్రీడ్రీ ప్రింటింగ్ ఇండ్ల వల్ల పర్యావరణ పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మిగతా ఇళ్లతో పోలిస్తే కార్బన్ డై ఆక్సైడ్ ను త్రీడ్రీ ప్రింటింగ్ ఇండ్లు తక్కువ మోతాదులో వెలువరిస్తాయి. అలాగే..ఇతర వాటితో పోలిస్తే..త్రీడీ ప్రింటింగ్ ఇంటి ఉష్ణోగ్రత పది డిగ్రీలు తక్కువగా ఉండడం వల్ల ఎండాకాలంలోనూ చల్లగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.






