ఎక్సైజ్ బదిలీల్లో సిఫారసుల జోరు.. బెస్ట్ పోస్టింగ్‌కు మంత్రులకు ముడుపులు‌?

by Kema Shiva Kumar |

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి, పొలిటికల్ రికమెండేషన్లు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎక్సైజ్ బదిలీల్లో సిఫారసుల జోరు.. బెస్ట్ పోస్టింగ్‌కు మంత్రులకు ముడుపులు‌?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్సైజ్ శాఖలో ఇటీవల జరిగిన బదిలీలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పనితీరు, నిబద్ధత ఆధారంగా కాకుండా కేవలం సిఫారసుల మేరకే పోస్టింగ్స్ ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు సిఫారసు చేసిన అధికారులకే ఫోకల్ స్థానాలు కేటాయించి, మిగతా వారికి అప్రాధాన్యత ఉన్న స్థానాలకు బదిలీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు చర్చ జరుగుతున్నది.

ఇన్‌కం ప్లేస్‌కు డిమాండ్..

ఎక్సైజ్ శాఖలో కింది స్థాయి నుంచి మొదలుకుని పై‌స్థాయి అధికారి వరకు ప్రతి నెల మామూళ్లు తీసుకుంటారనేది బహిరంగ రహస్యం. అయితే అత్యధికంగా ఆదాయం ఉండే ఏరియాల్లో పనిచేసేందుకు అధికారులు పోటీలు పడుతుంటారు. ఇటీవల డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టింట్ కమిషనర్ పోస్టులకు ప్రమోషన్లు ఇస్తూ బదిలీలు చేశారు. పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియలో పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్టు తెలుస్తున్నది. స్వయంగా మంత్రులు, ఎంపీలు, సలహాదారులు ఫలానా అధికారికి ఫలానా చోట పోస్టింగ్ ఇవ్వాలని సిఫారసులు లెటర్లు ఇచ్చారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు ముగ్గురు మంత్రులు లెటర్లు పంపగా, కొన్ని పోస్టులకు మంత్రులు, కీలక ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు సైతం సిఫారసు లెటర్లు ఇచ్చినట్టు సమాచారం. దీనితో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో తెలియక అధికారులు సతమతమైనట్టు టాక్ ఉంది. ఈ ప్రక్రియలో పలు దఫాలుగా వడపోసిన తరువాత కొందరి సిఫారసుల మేరకు పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

సిఫార్సుల వెనుక ముడుపులు?

సహజంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి అధికారులు పోస్టింగ్స్ కోసం సిఫారసు లెటర్లు తెచ్చుకోవడం సహజం. కాని ఎక్సైజ్ శాఖలో జరిగే పోస్టింగ్స్‌లో మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దందాలో మంత్రుల పేషీల్లో పని చేస్తున్న వ్యక్తులే కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే పలువురు మంత్రుల పేషీల నుంచి పదే పదే ఎక్సైజ్ శాఖ అధికారులకు పోస్టింగ్స్ విషయంలో ఫోన్లు వచ్చినట్టు తెలిసింది. పోస్టింగ్స్ విషయంలో కేవలం మంత్రులు, ఎంపీలకే ప్రాధాన్యత ఇచ్చి, తమను నిర్లక్ష్యం చేశారనే ఆవేదనలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం.

కీలక అధికారులకు లబ్ధి..

మంత్రులు, ఎంపీలు, సలహాదారుల సిఫారసుల మేరకు పోస్టింగ్స్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖలో కీలక హోదాలో పనిచేస్తోన్న అధికారులు పనిలో పనిగా తమకు సన్నిహితంగా ఉంటున్న కింది స్థాయి అధికారులకు అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అత్యంత ఫోకల్ ఏరియాల్లో పోస్టింగ్స్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీనితో సదరు కీలక అధికారుల ‘మంచి చెడు’లను చూసుకుని బాధ్యతల్లో భాగస్వామ్యం కల్పించారని ప్రచారం ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నది. అయితే పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియలో ఒకట్రెండు సామాజిక వర్గానికి చెందిన అధికారులకే ఫోకల్ స్థానాలు ఇచ్చి, మిగతా వర్గాలను నాన్ ఫోకల్ స్థానాలు కేటాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Next Story