- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాంచందర్ రావు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకి.. విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఆరోపించారు. ఇవాళ ఆయన గాంధీ భవన్ (Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రాంచందర్ రావు వ్యవహారం బీసీలకు వ్యతిరేకంగా ఉందని కామెంట్ చేశారు. బీసీ రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్నామని రాష్ట్రంలో చెబుతూనే.. ఢిల్లీకి వెళ్లగానే మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చిత్తశుద్ధిని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేబినెట్‌లో, ఆసెంబ్లీలో ఆమోదించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని అన్నారు. అదేవిధంగా 42 శాతం రిజర్వేషన్ల కోసం పకడ్బందీగా కులగణన చేశామన్నారు.
బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. పక్కాగా లెక్కలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోమని చెప్పింది సుప్రీం కోర్టేనని అన్నారు. గతంలోనూ తమిళనాడు (Tamilnadu) రిజర్వేషన్లను పెంచుకుందని గుర్తు చేశారు. మైనారిటీ రిజర్వేషన్లను బూచిగా చూపి బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీ (BJP) ప్రయత్నం చేస్తోందని అన్నారు. కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ ఎంపీలదేనని అన్నారు. రామచందర్ రావు కూడా ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి బీసీ రిజర్వేషన్లపై నిలదీయాలని అన్నారు. సొంత పార్టీని ఒప్పించకపోవడం చేతకాక తమపై విమర్శలు చేస్తే సహించబోమని అన్నారు. తెలంగాణ బీసీలు బీజేపీ దొంగ నాటకాన్ని గమనించాలని పిలుపునిచ్చారు. బీజేపీ బీసీ నేతలు ఈ విషయంపై నోరు విప్పాలని అన్నారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అర్వింద్ మిగిలిన నాయకుల నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆది శ్రీనివాస్ అన్నారు.






