- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారుల నిర్మాణ పురోగతి ఎలా ఉంది ?
తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణ పురోగతి ఎలా ఉందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం

జాతీయ రహదారుల నిర్మాణ పురోగతి ఎలా ఉంది ?
* పెండింగ్ లో ఉన్న హైవే విస్తరణ పనుల పూర్తికి తీసుకుంటున్న చర్యలేంటి ?
* ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఇచ్చిన కనెక్షన్లు ఎన్ని ?
* 2020 నుంచి చిన్న పరిశ్రమల మూసివేతకు కారణాలను గుర్తించారా ?
* లోక్ సభలో వివరాలు కోరిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణ పురోగతి ఎలా ఉందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం మూడు అంశాలపై ఎంపీ ప్రశ్నించారు. జాతీయ రహదారులతో పాటు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై ) కనెక్షన్లు, సూక్ష్మ, మధ్యస్థ పరిశ్రమల మూసివేతకు గల కారణాలపై ఆయన ప్రశ్నించారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం, సహజ వాయువుల శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే లు వేరువేరుగా లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారు.
* జాతీయ రహదారులకు సంబంధించి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. భారత్ మాల పరియోజనలో భాగంగా 2017లో దేశవ్యాప్తంగా 34,800 కిలోమీటర్ల జాతీయ రహదారులను రూ.5.35 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందులో 20,070 కిలోమీటర్లు ఇప్పటికే నిర్మించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1,719 కిలోమీటర్ల మేరా నిర్మాణాలకు గాను 874 కి. మీ. పూర్తయినట్లు చెప్పారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి అన్నిచోట్లా సకాలంలో పూర్తి చేస్తామని వివరించారు.
* ప్రధానమంత్రి ఉజ్వల యోజన ( పీఎంయువై) పురోగతిపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి.. సమాధానమిస్తూ.. పేద వయోజన మహిళలకు డిపాజిట్ రహిత ఎల్ పీ జీ కనెక్షన్లను అందించే లక్ష్యంతో 2016 లో ప్రారంభించామని అన్నారు. 8 కోట్ల కనెక్షన్ల లక్ష్యాన్ని సెప్టెంబర్ లో సాధించామని తెలిపారు. మిగిలిన అర్హులైన పేదల కోసం 2021లో చేపట్టిన ఉజ్వల 2.0 ద్వారా 2022 డిసెంబర్ లో 1.60 కోట్ల కనెక్షన్ లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నాటి గణాంకల ప్రకారం 10.33 కోట్ల పీఎంయువై కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని మహిళలు కట్టెల పొయ్యిని వీడేలా చేసి, శ్వాసకోశ ఇబ్బందులను దూరం చేసి, వారి జీవితాల్లో ఈ పథకం గణనీయ ప్రభావం చూపిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2019-20 లో 1,48,480 కనెక్షన్లు, ఉజ్వల 2.0 కింద 2023- 24 లో 32,890 కనెక్షన్లు. ఈ ఏడాది ఇప్పటి వరకు 336 కనెక్షన్లు మంజూరు చేసినట్లు వివరించారు.
* సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే సమాధానం ఇస్తూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రిజిస్ట్రేషన్ పోర్టల్ 2020లో ప్రారంభమైనట్లు తెలిపారు. పరిశ్రమలు, సంస్థల ద్వారా దేశ వ్యాప్తంగా 28.49 కోట్ల మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందారని, తెలంగాణకు సంబంధించి 2020- 21 లో 1.63 లక్షల మంది, 2025 -26కు సంబంధించి 1.23 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు తెలిపారు. జీడీపీలో ఎగుమతి వాటా 2023 -24 లో 45. 73 శాతం ఉందని, నకిలీ రిజిస్ట్రేషన్, కంపెనీ యజమాని మార్పు తదితర కారణాలతో 0.15 శాతం చిన్న తరహా పరిశ్రమలు మూతపడినట్లు వివరించారు.






